బన్నీ-పూరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమాపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఓకే చెప్పిన విక్రమ్ కె కుమార్ సినిమాని బన్నీ పక్కన పడేశాడని చెప్పుకొంటున్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ తో మరో సినిమా చేసేందుకు బన్నీ ఆసక్తిచూపుతున్నాడట. తాజాగా, బన్నీతో సినిమా చేయబోయే దర్శకుల లిస్తులో పూరి జగన్నాథ్ పేరు కూడా వినిపిస్తోంది. వీరి కలయికలో ఇప్పటికే దేశముదురు, ఇద్దరమ్మాయిలతో సినిమాలొచ్చాయ్. ప్రస్తుతం బన్నీ కోసం ఓ మంచి కథని పట్టే పనిలో పూరి ఉన్నట్టు సమాచారమ్.

అది సొంత కథ కాకపోయినా ఫర్వాలేదని అంటున్నాడట. ఇతర రచయితలు అందించిన కథతోనైనా బన్నీతో సినిమా చేసేందుకు పూరి ఆసక్తి చూపుతున్నాడు. ‘టెంపర్’ తర్వాత పూరికి మరో హిట్ లేదు. టెంపర్ కూడా సొంత కథతో తీసింది కాదు. ఆ కథని వక్కంతం వంశీ అందించారు. ఇక, సొంత కథతో పూరి హిట్ కొట్టక చాన్నాళ్లవుతోంది. సొంత కథనా.. ? కాదా.. ? అనే విషయం పక్కన పెట్టి.. హిట్ కొట్టాలనే కసితో పూరి ఉన్నాడు. మరోవైపు, బన్నీకి కూడా సరైన కథ దొరకడం లేదు. ఒకవేళ పూరి కథతో మెప్పిస్తే..ఆయనకు అవకాశం ఇచ్చేందుకు బన్నీ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.