తూరుపు వెళ్లే కారులో… చోటెవరికో..?
వరంగల్ తూర్పు నియోజవర్గంలో టీఆర్ఎస్ లో గ్రూప్ వార్ రోజురోజుకు పెరుగుతోంది. కొండా దంపతులకు, మేయర్ నరేందర్ కు మధ్య పెద్ద వారే నడుస్తోంది. ఖబడ్దార్ అంటే ఖబడ్దార్ అంటూ ఒకరికొకరు వార్నింగ్ లు ఇచ్చుకునే స్థాయిలో వీరిమధ్య గొడవలు ముదిరిపోయాయి. స్థానికంగా ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం జరిగినా అక్కడ రెండు గ్రూపుల టీఆర్ఎస్ నేతల మధ్య ఫైట్ జరుగుతూనే ఉంది. అభివృద్ధి కార్యక్రమ ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలే వేదికగా ఎవరికి వారు తామేం తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇటీవల పోచమ్మ మైదాన్ సెంటర్ లో ఇక్బాల్ మినార్ విషయంలో వీరి మధ్య అంతరాలు తారాస్థాయికి చేరాయి. తాము ఒక సైగ చేస్తే చాలు మైనార్టీలు మేయర్ పై దాడి చేసేవారంటూ కొండా సురేఖ వ్యాఖ్యానించడం అక్కడ హీట్ పెంచింది. దీంతో మేయర్ కూడా కొండా దంపతులపై సవాల్ విసిరారు కూడా. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానం దక్కించుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదో ప్రిస్టేజీగా తీసుకున్నారు కూడా. టీఆర్ఎస్ లో ఇతర నేతలు కూడా ఎమ్మెల్యే స్థానంపై ఆశిస్తున్నప్పటికీ ఈ ఇరువురు నేతలు మాత్రం సవాల్ గా తీసుకుంటున్నారు.
గతంలో ఎర్రబెల్లికి కొండా దంపతులకు మధ్య పెద్ద వారే జరిగింది. తాజాగా ఇప్పుడు మేయర్ వంతు వచ్చిందనేది లోకల్ టాక్. అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలో సీఎం కేసీఆర్ , హరీష్ రావులకు తెలుసంటూ బహిరంగ వేదికల్లోనే కొండా దంపతులు చెబుతున్నారు. ప్రభుత్వం మేయర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినపుడు మాట్లాడాలంటూ కొండా మాట్లాడటం కూడా పార్టీలో కుంపటి రాజుకునేందుకు కారణాలుగా చెప్పుకుంటున్నారు. మొత్తంగా వీరి మధ్య పెద్ద అంతర్గత యుద్ధ వాతావరణం ఏర్పడింది. మరి ఎన్నికల్లోగా వీరి మధ్య సయోధ్య కుదురుతుందో లేక వివాదం ఇంకా పెద్దదవుతుందో చూడాలి మరి.