రివ్యూ : సాక్ష్యం – బలంగా ఉంది !


చిత్రం : సాక్ష్యం (2018)
నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే

సంగీతం : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్

ద‌ర్శ‌క‌త్వం : శ్రీ‌వాస్

నిర్మాత – అభిషేక్ నామా

రిలీజ్ డేటు : 27జులై, 2018.

రేటింగ్ : 2.5/5

శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – పూజ హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘సాక్ష్యం’. పంచ‌భూతాల నేప‌థ్యంతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా టీజర్, ట్రైల‌ర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. అవి సినిమాపై అంచనాలని పెంచేశాయి. ఇదీగాక, ఓ మినీ బాహుబలి తీసినట్టు చిత్రబృందం తెలిపింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన పాజిటిక్ టాక్ నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ‘సాక్ష్యం’ ఎంత బలంగా ఉంది. అది ఏ మేరకు ప్రేక్షకులని ఆకట్టుకుంది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

రాజాగారు (శరత్ కుమార్) కొడుకు విశ్వాజ్ఞ (బెల్లంకొండ శ్రీనివాస్). ఎన్నో వ్రతాలు, నోములు చేసిన తర్వాత కలిగిన సంతానం విశ్వాజ్ఞ. విశ్వాజ్ఞ పసిబిడ్డగా ఉన్నప్పుడే మునిస్వామి (జగపతిబాబు) రాజాగారు, అతని కుంటుంబం మొత్తాన్ని అతి దారుణంగా చంపేస్తాడు. పంచభూతాల సాయంతో సాయంతో విశ్వాజ్ఝ బతికి బయటపడతాడు. అమెరికాలోని పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అయిన శివ ప్రసాద్ (జయ ప్రకాష్, పవిత్రా లోకేష్)ల కొడుకుగా పెరిగి.. పెద్దవాడవుతాడు. వీడియో గేమ్ డెవలపర్‌ విశ్వాకి.. ప్రవచనాలు చెప్పే సౌందర్య లహరి (పూజ హెగ్డే) నచ్చేస్తుంది. ప్రేమిస్తాడు. ఆమె కోసమే ఇండియాకు వస్తాడు. ఇక్కడ తనకు తెలియకుండానే తన ఫ్యామిలీని చంపేసిన వారిని చంపేస్తాడు. అదేలా సాధ్యమైంది.. ? చివరికి సౌందర్య లహరి ప్రేమని దక్కించుకొన్నాడా.. ? అనేది ట్విస్టులతో కూడిన మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

* పంచభూతాల కాన్సెప్ట్

* టేకింగ్

* సినిమాటోగ్రఫి

* బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

* ఎమోషన్ సీన్స్ పండకపోవడం

ఎవరెలా చేశారంటే ?

ఒక దుర్మార్గుడి దుష్ట బుద్దితో కుటుంబం మొత్తం మ‌ర‌ణించ‌గా.. పంచ భూతాలు ఆ దుర్మార్గుడ్ని ఎలా అంతం చేశాయ‌నేదే ఈ సినిమా కథ. దర్శకుడు ఎంచుకొన్న పంచభూతాల కాన్సెప్ట్‌ బాగుంది. దానికి.. యాక్షన్ జోడించడం ఇంకా బాగుంది. ఐతే, ఎమోషనల్ సీన్ల ఇంకాస్త గ్రిప్పింగ్ గా తీస్తే బాగుండేది. యాక్షన్ సీన్లపై దృష్టిపెట్టిన దర్శకుడు.. కథ, కథనాలను బలంగా చూపించలేకపోయాడనిపించింది. విశ్వాజ్ఞ‌ పాత్రకు బెల్లంకొండ సరిగ్గా సరిపోయాడు. ఓ మాస్ హీరోలో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ అతనీలో ఉన్నాయనిపించింది. పాటలు, ఫైట్స్‌లో ఇరుగదీశాడు. ఎమోషన్ సీన్లలో ఇంకా పరిణతి చూపించాల్సిన అవసరం ఉంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే సంప్రదాయ అమ్మాయిగా కనిపించింది. ఇప్పటి వరకు ఆమె గ్లామర్ పాత్రలే చేసింది. ఇప్పుడు కాస్త పద్దతిగా కనిపించేసరికి ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. ఆమె అందాలని ఆస్వాదించలేకపోయారు. ఐతే, నటనలో పరిణతి చూపించింది పూజా. ఇన్నాళ్లు ఆమెకు ఆ అవకాశం రాలేదు. ఈ సినిమా తర్వాత నన్ను ఎవ్వరూ మనిషిలా చూడరని జగపతి బాబు చెప్పారు. అది నిజమే అనిపించింది. దుర్మార్గమైన విలన్ పాత్రలో జగపతి బాబు అద్భుతంగా నటించారు.

మిగితా విలన్ పాత్రల్లో అశుతోష్ రాణా, రవి కిషన్.. బాగానే చేశారు. హీరోకు తల్లిదండ్రులగా నటించి శరత్ కుమార్ – మీనా లది అతిథి పాత్రలే. కేవలం మొదటి 10నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. పవిత్రా లోకేష్, జయప్రకాశ్‌, రావు రమేష్ .. తదితరుల నటన బాగుంది. అనంత్ శ్రీరాం‌ (వాల్మికీ) పాత్ర సినిమాకు మైనస్ అయింది. భారమైన, భావోద్వేగాన్ని పండించే పాత్రలో శ్రీరామ్ మెప్పించలేకపోయారు.

సాంకేతికంగా :

విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. ఓ మినీ బాహుబలి తీశామని చిత్రబృందం చెప్పింది. ఆ రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ లేకున్నా.. బాగానే అనిపించాయి. ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. గ్రాఫిక్స్‌తో యాక్షన్ సీన్లు అద్భుతంగా వచ్చాయి. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ పనితీరు బాగుంది. బుర్రాసాయి మాధవ్ డైలాగ్స్ బాగా పేలాయి. నీతి పద్యాలు విలన్ చేత చెప్పించడం కొత్తగా ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం రెండూ బాగున్నాయి. ఐతే, కథకి పాటలు అడ్డు వచ్చినట్టు అనిపించింది. సినిమాలో ఇంకొన్ని సీన్స్ కి కత్తెర పెట్టొచ్చు. ‘అభిషేక్ నామా’ నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాటమ్ లైన్ : పంచ భూతాల యాక్షన్.. ‘సాక్ష్యం’

రేటింగ్ : 2.5/5