రామోజీ ఫిలింసిటీ మార్కెట్ లో ‘సాహో’
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ‘సాహో’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన మార్కెట్ సెట్లో జరుగుతున్న షూటింగ్ లో హీరోయిన్ శ్రద్ధాకపూర్తోపాటు, మరికొద్దిమంది నటులు పాల్గొంటున్నారు. 40రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఇక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ ని కూడా తెరకెక్కించనున్నట్టు సమాచారమ్.
రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో ‘సాహో’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం ఇప్పటికే ప్రభాస్ గల్ఫ్ దేశాలు చుట్టొచ్చారు. అక్కడ రూ.90 కోట్ల వ్యయంతో యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించారు. తక్కువ విజువల్ ఎఫెక్ట్స్ వాడుతూ యాక్షన్ హైలైట్ చేస్తూ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాకావడంతో ‘సాహో’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీతనంతో తెరకెక్కుస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ బాషల్లో సినిమాని విడుదల చేయనున్నారు.
నీల్ నితిన్ ముఖేష్, ఎవ్లీన్ శర్మ, లాల్, అరుణ్ విజయ్, మందిరాబేడి, జాకీ ష్రాఫ్, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం శంకర్ – ఎహసాన్ – లాయ్. ప్రభాస్ సొంత బ్యానర్ గా పిలవబడే యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు తెలిసింది. ఇక, సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు.