‘సైరా’ సెట్ ని కూల్చేశారు
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 151 ‘సైరా నర్సింహారెడ్డి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.
ఇప్పుడు ‘సైరా’ సమస్యల్లో చిక్కుకొంది. ఈ సినిమా సెట్‌ను షేర్‌లింగంపల్లి రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా ‘సైరా’ సినిమా కోసం సెట్ వేశారని పేర్కొంటూ ఆ నిర్మాణాన్ని కూల్చి వేశారు.
ఈ సెట్ ని పూర్తిగా ‘సైరా’ సినిమా కోసం వేయలేదు. అప్పటికే ఆ స్థలంలో రామ్‌చరణ్ ‘రంగస్థలం’ సినిమాకు సంబంధించి గ్రామం సెట్టు ఉంది. అందులోనే ఒక భాగంలో సైరా నర్సింహారెడ్డి నివాసానికి సంబంధించి చిత్ర బృందం పెద్ద ఎత్తున ఇంటి సెట్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా, అనుమతి లేదంటూ రంగస్థలం సెట్ తో పాటు, సైరా కోసం తీర్చి దిద్దిన సెట్ ని కూల్చేశారు రెవెన్యూ అధికారులు. దీంతో షూటింగ్ ఆగిపోయిందని సమాచారమ్.
దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సైరా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బాహుబలి తర్వాత ఆ రేంజ్ సినిమాగా నిలుస్తుందని ఆశపడుతున్నారు. సైరా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.