నిరూపించకపోతే ఈ రాష్ట్రం విడిచి వెళతా..! హరీష్ సిద్ధమా..?
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మంత్రి హరీష్ కు ఛాలెంజ్ విసిరారు. కేసీఆర్ కుటుంబం నీళ్లను అడ్డుపెట్టుకుని దోచుకుంటుందని, కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు సవరించుకుంటారని తాము సూచనలు చేస్తే ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దివాలా రాష్ట్రంగా మారిందని, అత్యంత ధనవంతుల జాబితాలో కేసీఆర్ కుటుంబం చేరిందని ఆయన అన్నారు. రబ్బర్ చెప్పులు కూడా వేసుకోలేని కేసీఆర్ బంధువులు కొందరు ధనవంతులు అయ్యారని ఆయన విమర్శించారు. నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు.
2016లో సీతారామ ప్రాజెక్టు కు కేసీఆర్ టెండర్లు పిలిచారని, 7926 కోట్లు మంజూరు చేసారని, మళ్ళీ తాజాగా నిర్మాణ వ్యయాన్ని130027కు పెంచుతూ కొత్త జీవో ఇచ్చారని ఆయన చెప్పారు. రెండేళ్లలోనే 5వేల రెండు వందల కోట్ల అంచానాలను ఎవరి ధన దాహాన్ని తీర్చడానికి పెంచారని ఆయన ప్రశ్నించారు. మొదటి జీవో లో 5లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పి, కొత్త జీవోలో 3 లక్షల 28 ఎకరాల కొత్త ఆయాకట్టుగా చెబుతున్నారని ఆయన తెలిపారు. ప్రాజెక్టులు ఎన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంచనాలు పెరగడం అంటే అవినీతే కారణమని ఆయన ఆరోపించారు.
తాను నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నానని, నిరూపించకపోతే తాను ఈ రాష్ట్రం విడిచి వెళతానని, హరీష్ ఇందుకు సిద్ధమేనా అని రేవంత్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి, మంత్రి బిజీ గా ఉంటే మీ సాంకేతిక నిపుణులను పంపండి దోపిడిని నిరూపిస్తానంటూ ఛాలెంజ్ చేశారు రేవంత్.