విన్న‌పాలు విన‌వ‌లె…!!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతోభేటీ అయ్యారు. ప్ర‌ధానితో గంట‌సేపు స‌మావేశ‌మైన ఆయ‌న హైకోర్టు విభజన, తెలంగాణలో కొత్తజోన్లఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విభజన హామీల అమలు తదితర అంశాలపై ప్రధానితో చ‌ర్చించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధులు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచడం, సెక్రటేరియట్ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలాల కేటాయింపును ప్ర‌స్తావించారు.

వెనుక బడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదల, ఐఐఎం మంజూరు, ఐటిఐఆర్ కు నిధులు, కరీంనగర్ లో ఐఐఐటి ఏర్పాటు, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తదితర అంశాలపై ప్రధాన మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌ధానికి మొత్తం 11 అంశాల‌పై వినతి పత్రాలు సమర్పించారు.

80వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 20 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందడంతో పాటు మంచినీటికి, పారిశ్రామిక అవసరాలకు కూడా నీరు లభిస్తుందని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు రూ.25వేల కోట్లతో పాటు, ఆర్థిక సంస్థల నుంచి మరో రూ.22 వేల కోట్ల రుణం కూడా పొందామ‌ని విన‌తి ప‌త్రంలో పేర్కొన్నారు. ఇంకా నిధుల అవసరం ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి, 20వేల కోట్ల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించాలన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రాతిపదికన కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కాబట్టి దీనికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని విన్న‌వించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థల విభజన పూర్తయినా, హైకోర్టు విభజన మాత్రం పూర్తి కాలేదని, హైదరాబాద్ లోనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి హైకోర్టు కొనసాగుతున్నదని, తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి న్యాయవాదులు తమ హైకోర్టు తమకుండాలని బలంగా కోరుకుంటున్నారు కాబట్టి జోక్యం చేసుకుని తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ లో కొత్త సచివాలయం నిర్మించడానికి బైసన్ పోలో గ్రౌండ్ స్థలాన్ని కేటాయించాలని ఇప్పటికే రక్షణ శాఖను కోరాం. ఆ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలి. 44వ నెంబరు జాతీయ రహదారి, 1వ నెంబరు స్టేట్ హైవే విస్తరించడానికి అనుగుణంగా రక్షణ శాఖ ఆధీనంలోని స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి రక్షణ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ భూములను కూడా వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే, హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి అనువుగా రహదారులను విస్తరించడం సాధ్యమవుతుంది. ఈ మూడు ప్రాంతాల్లోని రక్షణ శాఖ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు.

తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు త్వరిత గతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైను నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. ఈ లైను నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయగలరు. అక్కన్నపేట్-మెదక్ రైల్వే లైను నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ దాదాపు పూర్తయింది. ఈ లైను నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాము. భద్రాచలం రోడ్-సత్తుపల్లి కొత్త రైల్వే లైను నిర్మించాలని కోరారు.

కాజీపేట- విజయవాడ మధ్య విద్యుదీకరణతో కూడిన మూడో లైను నిర్మాణం, రాఘవాపురం-మందమర్రి మధ్య మూడో లైను నిర్మాణం, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ మధ్య బ్రాడ్ గేజ్ లైన్ నిర్మాణం చేపట్టాలని మనవి చేస్తున్నాం. సికింద్రాబాద్-మహబూబ్ నగర్, సికింద్రాబాద్-జహీరాబాద్ రైల్వే లైన్లను ను డబుల్ లేన్ గా మార్చడానికి, హుజురాబాద్ మీదుగా కాజీపేట-కరీంనగర్ మధ్య రైల్వే లైను నిర్మించడానికి అవసరమైన సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) మంజూరు చేయాల‌ని కోరారు.

కేంద్ర ప్రభుత్వం 2013 సంవత్సరంలో హైదరాబాద్ కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజన్ (ఐటిఐఆర్) మంజూరు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ కూడా సమర్పించింది. కానీ హైదరాబాద్ లో ఐటిఐఆర్ ప్రాజెక్టును కేంద్రం ఉపసంహరించుకున్నట్లుగా కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నట్లు పత్రికల్లో చదివాము. ఐదేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రాజెక్టును ఉపసంహరించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయత దెబ్బతింటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుకు నిధులిచ్చి, హైదరాబాద్ లో ఐటిఐఆర్ ప్రాజెక్టుకు చేయూతను అందించాలన్నారు.

ప్రతీ జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధానంగా పెట్టుకుంది. తెలంగాణలో ఇటీవలే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామ‌ని, కొత్త జిల్లాల్లో కూడా నవోదయ విద్యాసంస్థలను నెలకొల్పాల‌ని కోరారు. ఈ విద్యాలయాలకు కావాల్సిన స్థలం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు సీఎం.

కరీంనగర్ పట్టణంలో ఐఐఐటి స్థాపించాల‌ని, దీనికి సంబంధించి స్థలం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో పలు సాంకేతిక విద్యాసంస్థలున్నాయి. వరంగల్ లో నిట్ ఉంది. కరీంనగర్ నగరంలో ఐఐఐటి స్థాపించడం వల్ల సాంకేతిక విద్యా సంస్థలను జిల్లా కేంద్రాలకు మరింత బాగా విస్తరించినట్లవుతుందని విన‌తిప‌త్రంలో పేర్కొన్నారు.

విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాల (ఉమ్మడి జిల్లాలు) అభివృద్ధికి ఒక్కో జిల్లాకు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున 450 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందించాల్సి ఉంది. కానీ, 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగవ విడత ఆర్థిక సహాయం ఇంకా విడుదల కాలేదు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్ర బిసి రిజర్వేషన్ల బిల్లుకి ఆమోదం తెలపాలని ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు కేసీఆర్..