ఆపరేషన్ కొడంగల్ ఆరంభం..!
అధికార పార్టీకి కంట్లో నలుసులా మారిన కాంగ్రెస్ నేత రేవంత్ ను రాజకీయంగా అడ్డు తొలగించేందుకు చాలా కాలంగా వ్యూహ రచన చేసిన టీఆర్ఎస్ ఆపరేషన్ కొడంగల్ ను ప్రారంభించింది. శనివారం బస్ డిపో శంఖుస్థాపనకు మంత్రులు హాజరైన సభను నిర్వహించి సంకేతాలనిచ్చింది గులాబీ పార్టీ. కొడంగల్ కు వరాల జల్లు కురిపించిన మంత్రి హరీష్ రావు ఈ ఆపరేషన్ కు సారధిగా మారారనే టాక్ రాజకీయ వర్గాల్లో మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే కొడంగల్ లో గులాబీ జెండాఎగరేయాలని తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తోంది టీఆర్ఎస్.
ఒకరకంగా కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల యుద్ధం మొదలైంది. టీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసి తన బలం ప్రదర్శించాలని చూస్తే, రేవంత్ కూడా అంతే స్థాయిలో తన అనుచరులతో ర్యాలీకి సన్నద్ధమవడం పెద్ద సంఖ్యలో అనుచరులు ఆయన ఇంటికి చేరుకోవడం తన బలమేంటో అధికార పార్టీకి చూపించడంలో రేవంత్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అధికార పార్టీ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు రేవంత్ ప్రతివ్యూహంతో ముందుకెళ్లడం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రేవంత్ అనుచరులను కట్టడి చేయలేక పోలీసులు లాఠీ చార్జ్ నిర్వహించడంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు ఆపరేషన్ కొడంగ్ ఆరంభించడంతో రేవంత్ పై సరైన అభ్యర్థిని నిలిపేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. రేవంత్ ను ఢీకొనేందుకు నరేందర్ రెడ్డి కూడా నియోజకవర్గంలోనే ఉంటూ వచ్చే ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద కొడంగల్ నియోజవర్గాన్ని అధికార టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రేవంత్ ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రేవంత్ కూడా అంతే స్థాయిలో టీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరి కురుక్షేత్రాన్ని తలపించే 2019 ఎన్నికల్లో గులాబీ గుబాలిస్తుందో లేక హస్తం హస్తగతం చేసుకుంటుందో చూడాలి.