దేశం రాజకీయ యోధిడిని కోల్పోయింది..!!
డీఎంకే అధినేత కరుణానిధి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాకలు తీరిన రాజకీయ యోధుడిని దేశం కోల్పోయిందని, సాహిత్య, చలనచిత్ర, పత్రికా, రాజకీయ రంగాల్లో ఘనాపాఠిగా ఉన్న కరుణానిధి తన సేవాభావం, పాలనా అనుభవంతో తమిళ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ఆయన అన్నారు. కవి, రచయితగా,కళాకారునిగా,పత్రికా సంపాదకునిగా,రాజకీయ వేత్తగా, పరిపాలకుడిగా చెరగని ముద్రవేశారన్నారు.
కరుణానిధి మృతి తమిళనాడుకే కాదు భారతదేశానికే తీరనిలోటని, నిరుపేదలు,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కరుణానిధి ఎంతో పరితపించారని అన్నారు చంద్రబాబు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా, 13సార్లు శాసనసభ్యునిగా, 50ఏళ్ళు పార్టీ అధ్యక్షునిగా, 75ఏళ్ల రాజకీయ జీవితం అందరికీ ఆదర్శం,మార్గదర్శకమన్నారు. తాను నమ్మిన ద్రవిడ సిద్దాంతాలను ముందుకు తీసుకెళ్లారని, .తన రచనల్లో,రాజకీయంలో,పరిపాలనలో ప్రతిబింబించేలా చేశారని నిజ జీవితంలో ఆచరించి చూపించారన్నారు. ఆయన జీవిత కాలం తమిళనాట కరుణానిధి శకంగా మిగిలిపోతుందన్నారు చంద్రబాబు.