రాహుల్ పర్యటనతో క్లారిటీ వచ్చేనా..!?
తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతను తనవైపు మలుచుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు షురూ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో గ్రూపుతగాదాలతో సతమతమవుతుంటే, మరో వైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, ప్రచార రథ సారథి ఎవరు అనే అంశాలపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి అయ్యే అర్హతలపై ఇప్పటికే చాలాసార్లు కాంగ్రెస్ సీనియర్లు పెద్ద రాధ్దాంతమే చేశారు. అసలు ముఖ్యమంత్రి అయ్యే అర్హత తమకు గాక ఇంకెవరికి ఉందంటూ ఇప్పటికే ప్రకటనలు, ప్రచారాలు చేసుకున్నారు కూడా. అయితే ఇలాంటి ప్రకటనలు పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయని గ్రహించిన నేతలు ఇలాంటి ప్రకటనలు మానుకున్నారు.
సొంతంగా తామే ప్రకటించుకున్న వారు కొందరైతే, ఇతరులతో ప్రకటనలు, నినాదాలు చేయించుకుంటున్న వారు మరికొందరున్నారు.ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఎన్నికల తరువాత అధిష్టానం నిర్ణయిస్తుందని ఆ పార్టీ నేతలు బయటకు చెప్పినప్పటికీ, ఇప్పటినుంచే ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారనే చర్చ జరుగుతోంది. ఎవరికి వారు అవకాశం వచ్చిన ప్రతీ సారి తమ విధేయతను రాహుల్ ముందు ప్రదర్శిస్తున్నారట. మరోవైపు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రచార రథసారథి ఎవరనేదానిపై కూడా ఇంకా డైలామానే కొనసాగుతోంది. అసలు ఆ పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ అటు పార్టీలో, ఇటు ప్రజల్లో నెలకొంది.
రాహుల్ తెలంగాణ పర్యటనలో ఈ రెండు విషయాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు కాంగ్రెస్ లో ఓ టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు సిద్ధం కావాల్సిన యాక్షన్ ప్లాన్ పై కూడా రాహుల్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే కీలక పదవులకు సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించకపోయినా, ఎన్నికల బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రాహుల్ పర్యటనతో ఒక క్లారిటీ వస్తుందని పార్టీలో టాక్ వినిపిస్తున్న మాట వాస్తవం.