మళ్లీ తెరపైకి ముందస్తు..!!
కొంతకాలం క్రితం వరకు జమిలి ఎన్నికలపై ఢిల్లీలో జరిగిన హడావుడి గురించి అందరికీ తెలిసిందే. చాలాపార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంతో ఆ అంశానికి కాస్త బ్రేక్ పడింది. మళ్లీ తాజాగా ఈ అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులోనూ తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కేవలం అసెంబ్లీ ఎన్నికలే జరిపి, తరువాత లోక్ సభ ఎన్నికలు జరుపుతారా, లేక రెండూ ఒకే సారి జరుపుతారా అనే ప్రశ్న తలెత్తుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరపే అంశంపై ప్రధానితో చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. లోక్ సభ ఎన్నికలు కూడా కలిపి జరిపితే బీజేపీతో పాటు , టీఆర్ఎస్ కు నష్టం తప్పదని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబరులో ప్రభుత్వాన్ని రద్దు చేసి , ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో విపక్ష కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు పుంజుకునే సమయం ఇవ్వకుండా, అభివృద్ధి ఎజెండాతో ప్రగతి మంత్రంతో ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టీకాంగ్రెస్ కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమంటూ ప్రకటించడంతో పాటు, శ్రేణులను కూడా అందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. రాహుల్ పర్యటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపడంతో పాటు ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలను బలంగా తీసుకెళ్లే ప్లాన్ లో ఉంది కాంగ్రెస్. ముందస్తు ఎన్నికలతో కాంగ్రెస్ వ్యూహానికి చెక్ పెట్టాలనే ఆలోచనలో అధికార పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ముందస్తు వార్తలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. నియోజకవర్గాల్లో ఎన్నికల సందడి ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది.