తెలుగు రాజకీయాల్లో కొత్త ట్రెండ్…!!
శపథాలు, వ్యక్తిగత కారణాలు, మొక్కులు.. ఇలా కారణాలు ఏదైతేనేం.. రాజకీయాల్లో నేతలు ఇప్పుడు అంతా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రాజకీయాలు గడ్డం గీసుకున్నంత ఈజీ కాదు అన్నట్లుగా ఇప్పుడు గడ్డం పెంచడం అంత ఈజీ కాదు అన్నట్లుగా మారినట్లు కనిపిస్తోంది. రాజకీయాలకు , గడ్డానికి అంతటి అవినాభావ సంబంధం ఉందనేలా ప్రస్తుతం పరిస్థితి మారింది మరి.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాకాలంగా గడ్డం లుక్ లోనే కనిపిస్తున్నారు. ఆయన గడ్డం ఛాలెంజ్ వెనక ఓ పెద్ద కథే ఉంది. తెలంగాణలో రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారును గద్దె దింపే వరకూ తన గడ్డం తీయబోనని శపథం పట్టారాయన. కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి ఆయన ఇప్పటికీ పూర్తిగా గడ్డం పెంచుకునే తిరుగుతుంటారు. ఆయన ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇక పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఒకరు తన నియోజక వర్గానికి గండికోట రిజర్వాయర్ నీళ్లు అందే వరకూ గడ్డం తీయబోనని భీష్మించుకు కూర్చున్నారు.
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కూడా రీసెంట్ గా గడ్డం శపథం చేశారు. కడప ఉక్కు కోసం 11 రోజుల నిరాహార దీక్ష చేసి ఆపై విరమించిన రమేష్ … కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టేవరకూ తన దీక్ష విరమించబోనని, గడ్డం కూడా తీయననీ శపథం చేసుకున్నారట. తిరుమల శ్రీవారికి దర్శించుకుని మొక్కుకున్నారట. మరో వైపు జనసేనాని పవన్ కల్యాణ్ తన యాత్రలన్నింటినీ గెడ్డంతోనే కొనసాగిస్తున్నారు. పవన్ గడ్డం పెంచడానికి కారణం ఇది అని బాహాటంగా చెప్పకపోయినా ఆయన పొలిటికల్ యాత్రలన్నీ గడ్డంతోనే కొనసాగిస్తున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రస్తుతం గడ్డం ఛాలెంజ్ ల ట్రెండ్ నడుస్తోందని చెప్పొచ్చు.