ఎన్టీఆర్ బయోపిక్ గొప్ప ఆలోచన !
మహానటుడు, రాజకీయవేత్త ‘ఎన్టీఆర్’ బయోపిక్ కేవలం మాస్ జనాలనే కాదు, అభిమానులనే కాదు, మహిళలను కూడా ఆకట్టుకోవాలి. ఇందుకోసం దర్శకుడు క్రిష్ ఓ అద్భుతమైన స్క్రీన్ ప్లే ఐడియా వేసినట్టు సమాచారమ్. ఎన్టీఆర్ బయోపిక్ బసవతారకం పాయింట్ ఆఫ్ వ్యూలో వుంటుంది. అంటే ఎన్టీఆర్ కథను బసవతారకం (విద్యాబాలన్) చెబుతారన్నమాట.
ఈ సింగిల్ ఐడియాతో ఎన్టీఆర్ జీవితంలోని వివాదాల జోలికి వెళ్లకుండా.. కథని ముగించే అవకాశం దొరికింది. ఎన్టీఆర్ కి చాలా చిన్నతనంలోనే (1942) పెళ్లయ్యింది. ఎన్టీఆర్ కు బసవతారకంకూ బంధుత్వం కూడా వుందని అంటారు. వాళ్ల అరేంజ్డ్ మ్యారేజీ సంగతులు, ఇండస్ట్రీకి రావడం, సినిమాలు, రాజకీయాలు అన్నీ బసవతారకం యాంగిల్ లో స్టోరీని చెప్పబోతున్నారు.
1985లో బసవతారకం మరణించారు. అంటే అప్పటికే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, నాదెండ్ల వెన్నుపోటు, మళ్లీ దాన్ని అధిగమించి అధికారంలోకి రావడం జరిగిపోతాయి. తెరపై ఎన్ టీఆర్ రెండు సార్లు సీఎం అయ్యే సన్నివేశాలని చూపించబోతున్నారు. అది ఆయన్ని రాజకీయంగా అభిమానించే వారికి విపరీతంగా నచ్చుతుంది. కథ బసవతారకం చెబుతోంది.. కాబట్టి మహిళా ప్రేక్షకులని ఆకట్టుకోవడం గ్యారెంటీ. బసవతారకం బతికి ఉన్నని రోజులు లక్ష్మీ పార్వతీ ఏపీసోడ్, చంద్రబాబు వెన్నుపోటు అంశాలు చూపించనక్కర్లేదు. మొత్తానికి.. క్రిష్ గొప్ప ఆలోచనే చేశారు.