విష‌మించిన వాజ్ పేయి ఆరోగ్యం…!

బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. కిడ్నీ సమస్య, వృద్ధాప్య సమస్యలతో కొద్దికాలంగా బాధపడుతున్న వాజ్‌పేయి జూన్ 12న‌ ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పార్టీ అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఎయిమ్స్ చేరుకుంటున్నారు. విషయం తెలిసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎయిమ్స్ కు వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సదుపాయలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఆయన గత పది సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. బిజెపి ప్రభుత్వం వాజ్ పేయికి భారత రత్న బిరుదు ఇచ్చి సత్కరించింది. నైతిక విలువలకు పెద్ద క‌ట్టుబ‌డిన వ్య‌క్తిగా ఆయ‌నకు మంచి పేరుంది. ఒక్క ఓటు కోసం ఏకంగా తన ప్రభుత్వాన్నే పోగొట్టుకున్నారంటే ఆయ‌న నైతిక‌తకు ఎంత ప్రాధాన్య‌త‌నిస్తారో ఆ సంఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎయిమ్స్ వెళ్లి స్వ‌యంగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్ధితిని తెలుసుకున్నారు.

వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి క్షీణించ‌డంతో బిజెపి నేతలంతా తమ తమ రాష్ట్రాల్లో అధికారిక కార్యకలాపాలను రద్దు చేసుకున్నారు. గురువారం బిజెపి కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.