ప్రతి ఒక్కడూ నా పెళ్లి గురించి మాట్లాడుకునేవాడే !
టాలీవుడ్ లో పెళ్లికానీ ప్రసాదుల్లో రానా దగ్గుపాటి ఒకరు. ఈ లిస్టులో మహా ముదురు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాత రానా, నితిన్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్.. పేర్లు వినిపిస్తుంటాయ్. ఐతే, పెళ్లి అంటే వద్దు అనే ఈ యంగ్ హీరోలు తెరపై మాత్రం పెళ్లి కాన్సెప్ట్ తో సినిమాలు. పెళ్లి గొప్పదనం గురించి చెప్పేస్తుంటారు. ‘శ్రీనివాస కళ్యాణం’ తెరపై నితిన్ పెళ్లి అద్భుతంగా జరిగింది.
ఇక, ఇన్నాళ్లు తన పెళ్లి గురించి అడుగుతున్నవారందరికీ రానా మంచి సమాధానం ఇచ్చారు. ఆయన నిర్మాతగా మారి, విడుదల చేస్తున్న చిత్రం ‘కంచరపాలెం’. వెంకటేశ్ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. న్యూయార్క్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా కావడం గమనార్హం.
ఈ సినిమా ట్రైలర్ ని రానా బుధవారం విడుదల చేశారు. ఐతే, ట్రైలర్ లోని డైలాగులు రానాకి దగ్గరా అనిపించాయనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఇందులో ఓ పాత్రకి 49యేళ్లు వచ్చిన పెళ్లి కాదు. ఆ విషయాన్ని ఓ పెద్దాయన దరువేసి మరీ.. ‘అమ్మల్లారా.. అక్కల్లారా.. చెల్లెల్లారా.. మన ఊరి రాజు గాడికి 49 సంవత్సరాలు వచ్చినా పెళ్లి అవలేదు గనుకు ఆడోళ్లంతా నానా రకాలుగా మాట్లాడుతున్నారు.. మగోళ్లంతా భయపడుతున్నారు’ అంటూ చెప్పడం ఆకట్టుకుంటోంది.
ఇక, ‘చిన్నా లేదు పెద్దా లేదు ప్రతి ఒక్కడూ నా పెళ్లి గురించి మాట్లాడుకునేవాడే’ అంటూ 49యేళ్లు వచ్చినా పెళ్లి కానీ ప్రసాదు అసహనం వ్యక్తం చేయడం ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. ఈ డైలాగుకు రానాకు బాగా లింకైందనే కామెంట్స్ వినబడుతున్నాయి. బహుశా.. ఈ పాత్ర నచ్చే రానా ఈ సినిమాకి నిర్మాతగా మారి ఉంటారేమో.. ! ఇక, స్వయంగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసిన రానా.. ఈ ఏడాది రాబోతున్న అతి పెద్ద చిన్న సినిమా ఇది అంటూ ట్విట్ చేశాడు.