వాగులో చిక్కుకున్న ఐదుగురిని కాపాడిన మంత్రి..!

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. వ‌ర‌ద‌నీరు ఇళ్ల‌లోకి వ‌చ్చి చేరుతుండ‌టంతో ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల‌లోకి భారీగా వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేర‌డంతో సాత్నాల మ‌త్త‌డి వాగు ప్రాజెక్టు నాలుగు గేట్ల‌ను ఎత్తివేసి దిగువ‌కు నీటిని వ‌దిలారు అధికారులు.

ఆదిలాబాద్ శివారులోని నాగపూర్ వాగులో చిక్కుకున్న ఐదుగురు ఉపాధ్యాయుల ప్రాణాలను మంత్రి జోగురామన్న కాపాడారు. మావల మండలం వాగపూరు గ్రామంలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న రమేష్, ప్రవీణ్ కుమార్, ప్రతాప్ చంద్రశేఖర్, సుజాత కారులో పాఠశాలకు వెళ్తుండగా వైజాపూర్ వద్ద వరద ఉద్ధృతికి వాగులో చిక్కుకున్నారు.
విషయం తెలుసుకున్న మంత్రి జోగు రామన్న హుటాహుటిన ఫైరింజన్ వెంట తీసుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు .వాగులో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు బయటకు చేరవేశారు. అయితే కారు మాత్రం వాగులో కొట్టుకుపోయింది .