అసామాన్యం ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం.

సామాన్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి రాజకీయప్రస్థానం అందరికీ ఆదర్శనీయం. పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ పట్టభద్రుడైన ఆయ‌న యువకుడిగా ఉన్నప్పుడే రాజకీయాల పై ఆస‌క్తి చూపారు. 1947లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన క్విట్‌ ఇండియా ఉద్యమంలో 23 రోజులు జైలు జీవితం గడిపారు. 1951లో ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధంతో భారతీయ జనసంఘ్‌ ఏర్పాటులో కీలకపాత్ర వహించారు వాజ్ పేయి. 1957లో బలరామ్‌పూర్‌ నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైన ఆయ‌న శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ ప్రియశిష్యుడిగా రాజకీయాల్లో ఎదిగారు.

1968లో జనసంఘ్‌ జాతీయ అధ్యక్షుడిగా వాజ్ పేయి బాధ్యతలు చేపట్టారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో ఇందిర పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1977 సార్వత్రిక ఎన్నికల్లో జనతాపార్టీ ఘనవిజయం సాధించగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయ‌న పనితీరుతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీ, షెకావత్‌తో కలసి 1980లో భారతీయ జనతాపార్టీ స్థాపించారు. 1984లో బీజేపీ రెండు లోక్‌సభ సీట్లు మాత్రమే బీజేపీ సాధించినా, 1996 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 1996లో తొలిసారి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టినా, మెజార్టీ నిరూపించుకోలేక 13 రోజులకే రాజీనామా చేశారు.

1998 ఎన్నికల తర్వాత బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశారు వాజ్ పేయి. 1999 జులై 26 పాక్‌తో కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ విజయం సాధించ‌గా, ఢిల్లీ-లాహోర్‌ మధ్య సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను వాజ్‌పేయి పున:ప్రారంభించారు. వాజ్‌పేయి పాలనలో విదేశీ విధానం, ఆర్థిక రంగంలో కీలక సంస్కరణలు చేపట్టారు. కుంభకోణాలకు తావు లేకుండా ప్రాంతీయ పార్టీల్ని కట్టడి చేసిన రాజనీతిజ్ఞుడిగా, అతివాదుల్లో మితవాదిగా పేరొందారు ఆయ‌న‌ . 1999-2004లో ఐదేళ్ల పాటు సంకీర్ణ సర్కార్‌ను నడిపిన అపర చాణక్యుడుగా ఆయన కీర్తింపడ్డారు. కాంగ్రెస్సేతర ప్రధానిగా ఐదేళ్ల పాలన పూర్తి చేసిన ప్రధానిగా రికార్డు కెక్కారు.