వాజ్‌పేయీకి సినీ ప్రముఖుల సంతాపం

భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ గురువారం సాయత్రం తుదిశ్వాస విడిచారు. భావ కవిగా, భావకునిగా అటు సాహిత్యం, నేతగా నిలువెత్తు నీతిగా ఇటు రాజకీయాల్లో ఆయన ఓ హిమ శిఖరం. ఆయనకు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడి పుల్లారెడ్డి స్వీట్స్ అంటే అటల్ జీ మహా ఇష్టం. వాజ్ పేయి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఎస్‌.ఎస్‌.రాజమౌళి : రాజకీయాలకు వన్నెతెచ్చిన అతికొద్దిమంది రాజనీతిజ్ఞుల్లో వాజ్‌పేయీ ఒకరు. రహదారుల అనుసంధానం అనే ఆయన విజన్‌ దేశంలో బతుకుతున్న లక్షలాదిమంది జీవితాలను మార్చివేసింది. నా ప్రియమైన లీడర్‌కు శిరసు వంచి నమస్కరిస్తున్నా

రజనీకాంత్‌ : వాజ్‌పేయీ జీ ఇకలేరన్న వార్త వినడం చాలా విచారంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి

పవన్‌ కల్యాణ్‌ : మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మహాభినిష్క్రమణ భారతదేశానికి తీరని లోటు. ఆయన మన మధ్య ఇక ఉండరన్న విషయం జీర్ణించుకోవడం సాధ్యం కానిది. ఆయన ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి. రాజకీయ భీష్ముడిగా కీర్తిని అందుకున్న వాజ్‌పేయీ చిరస్మరణీయుడు

బాలకృష్ణ : వాజ్ పేయి మృతితో దేశం ఒక మహోన్నతమైన రాజకీయ నేతను కోల్పోయింది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను 2000 సంవత్సరం జూన్ 22న వాజ్‌పేయీ గారి చేతులమీదుగానే ప్రారంభించాం. నాన్నగారితో ఆయనకి మంచి అనుబంధం ఉంది. ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా పనిచేసింది.

మోహన్ బాబు : వాజ్‌పేయీగారితో మూడుసార్లు వేదిక పంచుకొనే అవకాశం దొరికింది. నా మాటలను మెచ్చుకొనేవారు ఆయన. నేను, విద్యాసాగర్ రావు గారు, వాజ్‌పేయీగారు కలిసి పనిచేశాం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. రాజకీయాల్లో వాజ్‌పేయీ లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు చాలా అరుదు. ఆయన నిస్వార్థ రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాథుని కోరుకొంటున్నాను

జూ. ఎన్టీఆర్‌ : మన దేశాన్ని ప్రగతిపథంలో నడిపిన గొప్ప నాయకుల్లో ఒకరైన వాజ్‌పేయీకి సెల్యూట్‌. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప నాయకుడికి సెల్యూట్‌. అసమాన రాజనీతిజ్ఞుడు, ధైర్యశాలి. ఆయన విజన్‌ కారణంగానే స్వర్ణ చతుర్భుజితో దేశంలోని ప్రాంతాలన్నీ చక్కగా ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యాయి. అటల్‌జీ మన గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటారు

మోహన్‌ లాల్‌ : దేశం ఎప్పుడూ చూడని ఓ గొప్ప ప్రధాని వాజ్‌పేయీ. ఆయన జీవితాంతం దేశ శ్రేయస్సు కోసం శ్రమించారు. ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో ఉంటారు

కొరటాల శివ : నిజమైన నాయకుడు. యావత్‌ భారతదేశం మిమ్మల్ని కోల్పోయింది. వాజ్‌పేయీ జ్ఞానం, నిజాయతీ, రాజనీతిజ్ఞతను ప్రతి రాజకీయ నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి

రానా దగ్గుబాటి : ఈరోజు ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం. భారత్‌ వెలిగిపోవడానికి నిత్యం కలలు కన్న మహోన్నత వ్యక్తి. మనల్ని ప్రగతిపథంలో నడిపిన గొప్ప వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి

అల్లరి నరేశ్‌: ఒక గొప్ప రాజకీయనాయకుడు, ప్రసిద్ధ కవి ఇక లేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా

నితిన్‌ : ఒక శకం ముగిసింది. ఆయన అద్భుతమైన రాజకీయ నాయకుడు. ఆయనను కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం

ధనుష్‌ : అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఇక లేరన్న వార్త తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. గొప్పమనిషిని కోల్పోయాం