గీత గోవిందులకు చరణ్ ప్రశంస

గీత గోవిందం రష్మిక, విజయ్ లపై ప్రశంసలు కురుస్తున్నాయి. వీరి ప్రేమకథని చూసి ఇండస్ట్రీ, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు గీత గోవిందులు బాగున్నారని కితాబిచ్చారు. తాజాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గీత గోవిందం సినిమాని వీక్షించారు. చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ట్విట్ చేశారు. ‘అర్జున్‌ రెడ్డి తరువాత విజయ్‌ పర్‌ఫెక్ట్‌గా మారిపోయాడు. విజయ్‌, రష్మికల సహజ నటన ట్రీట్‌లా ఉంది. మ్యూజిక్‌ చాలా బాగుంది. కథా, కథనాలు బాగున్నాయి. పరుశురామ్‌కు కంగ్రాట్స్‌. చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు కంగ్రాట్స్‌’ అంటూ ట్విట్ చేశారు రామ్ చరణ్.

గీత గోవిందం హిట్ టాక్ తో ఆనందంలో ఉన్న అల్లు అరవింద్ చిత్రబృందానికి పార్టీ ఇవ్వబోతున్నారు. ఇది శనివారం ఉండబోతుందని తెలిసింది. ఇక, ఆదివారం ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దర్శకుడు పరశురామ్ సింపుల్ ప్రేమకథనే రాసుకొన్నా.. దానికి వినోదం జోడించి సరికొత్త ట్రీట్ మెంట్ ఇచ్చారు. రష్మిక, విజయ్ ల నటనతో దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా విజయ్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందని చెప్పుకొంటున్నారు. ఈ సినిమాతో విజయ్ ఫ్యామిలీ ప్రేక్షకులకి దగ్గరయ్యాడని చెప్పవచ్చు.