కేరళకు తక్షణ సాయం ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు
భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళకు తక్షణ సాయాన్ని ప్రకటించారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. తెలంగాణ తరఫున తక్షణ సహాయంగా 25 కోట్లను ప్రకటించారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు . వెంటనే ఈ డబ్బులను కేరళ రాష్ట్రానికి అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. వరదల వల్ల జల కాలుష్యం జరిగినందున నీటిని శుద్ది చేసేందుకు రెండున్నర కోట్ల విలువైన ఆర్వో మిషిన్లను కేరళకు పంపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సిఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తే వాటిని తక్షణం కేరళ రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విపత్తు నుండి కేరళ రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
కనీవినీ ఎరుగని వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పది కోట్ల రూపాయల మేర సహాయం తక్షణమే అందిస్తామని వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యంతో తల్లడిల్లుతున్న కేరళ బాధితులకు తమ నైతిక సహాయం ఉంటుందని, వస్తూ సామాగ్రి రూపంలో సహాయం అందివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సహాయ బృందాలు పంపడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. త్వరగా రాష్ట్రం విపత్తు నుంచి బయట పది సాధారణ పరిస్థితులు నెలకొనాలని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.