సాయం చేసి విమర్శల పాలయ్యాడు
ఎవరైనా సాయం చేస్తే మా బాబే.. గొప్ప మనసున్న మారాజు అంటూ పొగుడుతుంటారెవరైనా. సాయం పొందినవారైతే అతని సాయాన్ని గుర్తించి చేతులు జోడించి నమస్కరిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం సాయం చేసి విమర్శల పాలవుతున్నారు. దేశమంతా కేరళ వరద బాధితులకు తమ వంతు సాయం చేస్తున్న ఈ సమయంలో దేశంలోనే అతిపిన్న వయసులో బిలియనీర్ అయిన పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ మాత్రం సాయం చేసి విమర్శల్లో చిక్కుకున్నారు.
12వేల కోట్లకు అధిపతి అయిన విజయ్ శేఖర్ శర్మ తన పేటీఎం యాప్ ద్వారా కేరళ బాధితులకు పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు. తాను ఇచ్చిన విరాళాన్ని స్క్రీన్ షాట్ తీసి ట్వీట్ పెట్టారు. ఆయన ఇచ్చిన వ్యక్తిగత విరాళం ఏమాత్రం సమంజసంగా లేదంటూ నెటిజన్ల నుంచి విమర్శల వర్షం కురిసింది. దీంతో ఆయన ట్వీట్‌ను వెంటనే తొలగించారు. కానీ చూస్తుండగానే దాని స్క్రీన్ షాట్లు వైరల్ అయిపోయాయి. సైనిక దళాల ఫ్లాగ్ డే సందర్భంగా భారత ఆర్మీకి 500 డొనేట్ చేసి గతంలోనూ విమర్శలపాలయ్యారు శేఖర్ శర్మ.