టీచ‌ర్లు, లెక్చ‌రర్ల బ‌దిలీల్లో అవినీతి…!?

విద్యాశాఖ ఇటీవల చేపట్టిన బదిలీల్లో భారీ అక్రమాలు, అడ్డు అదుపు లేని అవినీతికి తెరలేపారని టీపీసీసీ ముఖ్య అధికార ప్ర‌తినిధి దాసోజు శ్రావ‌ణ్ ఆరోపించారు. టీచర్లు, లెక్చరర్ల బదిలీల్లో అవినీతి పై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారాయ‌న‌. రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు పూర్తియినా ఇంకా అంతర్జిల్లా బదిలీల కోసం ఎదురుచూపులతో కాలం వెళ్లదీయాల్సిరావడం అమానుష‌మ‌ని ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 182.తేదీ 21.05.2016 నాడు విడుదల చేసిన ఉత్తర్వు ప్రకారం అంతర్జిల్లా బదిలీలు చేపట్టాలని ఆయ‌న అన్నారు.

దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యేలేదన్నసామెత చందంగా విద్యాశాఖాధికారుల వ్యవహారం ఉంద‌ని ముఖ్య‌మంత్రికి లేఖ‌లో తెలిపారు. అంతర్జిల్లా భార్యాభర్తల ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టకపోవడంతో వారంతా తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నార‌ని, 2014 ఎన్నికల హామీల్లో భాగంగా కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించి నాలుగేళ్లు గడిచినా ఆ హామీని నెరవేర్చలేదని లేఖ‌లో పేర్కొన్నారు దాసోజు. డిగ్రీకళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ లతో నడుపుతూ కాలం వెళ్లదీస్తూ విద్యావ్యవస్థను దిగజార్చారని ఆయ‌న ఆరోపించారు.

పూర్తి స్ధాయి లెక్చరర్లు , ప్రిన్సిపాల్ లు లేకుండా నాణ్యమైన విద్య ఎలా అందుతుందో ఉన్నత విద్యాశాఖాధికారులే చెప్పాలని ఆయ‌న అన్నారు. 50 కిలోమీటర్ల దూరం దాటి పోస్టింగులు ఇవ్వకూడదన్న స్పౌజ్ నిబంధనను తుంగలో తొక్కారని ఆరోపించారు. విద్యాశాఖాధికారులు, యూనియన్ పెద్దల అకృత్యాలతో దాదాపు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఉన్నత విద్యాశాఖా కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యాశాఖా మంత్రిపై తక్షణ విచారణకు ఆదేశించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.