‘సైరా’ ప్రోమో.. చూశారా ?

‘సైరా’ టీజర్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) కానుకగా.. ఒకరోజు ముందుగానే (ఆగస్టు21) సైరా టీజర్ ని విడుదల చేయనున్నారు. ఐతే, అంతకంటే ముందు ‘సైరా’ ప్రోమో వచ్చేసింది. సైరా మ్యూజికల్ ప్రోమో ఇది. సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిపై కట్ చేశారు. బాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించారు అమిత్. ఆయన సంగీతమందిస్తున్న తొలి తెలుగు సినిమా సైరా.

అమిత్ సంగీతం అందించిన బాలీవుడ్ హిట్ చిత్రాల పేర్లని పేర్కొంటూ.. సైరాకు అమిత్ సంగీతాన్ని అందిస్తున్నట్టు ప్రోమోలో చూపించారు. ఇక, సైరా కోసం సంగీత దర్శకులుగా ముందుగా ఏ ఆర్ రెహమాన్ ని అనుకొన్నారు. ఐతే, సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత సైరా సంగీత దర్శకులుగా థమన్, ఇళయరాజా, కీరవాణి.. తదితరల పేరు వినిపించాయి. ఫైనల్ గా బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిని తీసుకొన్నారు. ఇప్పుడు మ్యూజిక్ ప్రోమోని విడుదల చేసి.. సైరా సంగీత దర్శకుడు ఎవరు ? అనే విషయంలో ఏర్పడిన గందరగోళానికి తెరదించారు.

ఇక, రేపు (ఆగస్టు21) మెగా అభిమానులకు అసలు గిఫ్ట్ అందనుంది. సైరా టీజర్ రాబోతుంది. టీజర్ తో సినిమాపై అంచనాలు ఆకాశన్నంటడం ఖాయమని చెబుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా తెరకెక్కుతోంది. చిరు సరసన నయనతార జతకట్టనున్నారు. బిగ్ బీ అమితాబాబు, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చ సుధీప్.. తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత.