టీజేఎస్ పై కోదండరాం ధీమా అదేనా..?
తెలంగాణ జనసమితి ఆవిర్బావం తరువాత తెలంగాణలో ఆ పార్టీ రాజకీయ భవిష్యత్ పై రాజకీయ వర్గాల్లో , కొంతమంది నేతల్లోనూ అనుమానాలు కలిగాయి. జేఏసీ నుంచి పార్టీ ఏర్పాటు చేసి కోదండరాం తప్పు చేశారేమో అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేశారు కూడా. ఇంకొదరైతే కోదండరాం ఇప్పటి రాజకీయాలకు సరిపోతారా అంటూ ప్రశ్నలు సందిస్తున్నారు కూడా. అయితే ఇవేవీ పట్టించుకోకుండా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయి పార్టీ నిర్మాణం చేపడుతూ ముందుకు వెళుతున్నారు కోదండరాం. టీఆర్ఎస్ కు ధీటుగా బలపడేందుకు కోదండరాం వ్యూహరచన చేస్తున్నారనేది ఆయన మాటల్లో అర్థమవుతోంది.
టీజేఎస్ లో ఒక కోదండరాం మినహా పార్టీలో బలమైన నేతలెవరూ లేకపోవడం మైనస్ అంటూ రాజకీయ వర్గాల్లో చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే ఎవరు ఎంత నెగిటివ్ గా ఆలోచించినా కోదండరాం మాత్రం ధీమాతో ముందుకు వెళుతున్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై చర్చకు తెర తీశాడని కోదండరాం ఆరోపిస్తున్నారు. ముందస్తు, మధ్యంతర ఎన్నికల అంశం కేంద్రం పరిధిలోదని, ఎన్నికలు డిసెంబర్ లో వచ్చే అవకాశం లేదని ఆయన భావిస్తున్నారు. ముందస్తుకు బీజేపీ సహకరించదని, డిసెంబర్ లో ఎన్నికలు వచ్చే అవకాశం లేదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.
కేసీఆర్ సర్వేల పేరుతో అన్ని పార్టీలు మాయ చేస్తున్నాయని, ఏ పార్టీ కూడా సర్వే చేయలేదని ఆయన భావిస్తున్నారు. కేసీఆర్ కూడా సర్వేల పేరుతో ఇతర పార్టీలను, సొంత పార్టీ నేతలను భయపడుతున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. కానీ టీఆర్ఎస్ లో సమస్యలు పరిష్కరించడం కేసీఆర్ కు అంత తేలిక కాదని ఆయన భావిస్తున్నారు. ముందస్తు వస్తే టీజేఎస్ కే లాభమని , సెప్లెంబరులోపే పార్టీని ప్రజలకు చేరువవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు కోదండరాం. కొత్తగా రాజకీయాల్లో వచ్చే వారితో పాటు గతంలో రాకీయాల్లో ఉండి టికెట్ రాని వారు తమ పార్టీలోకి వస్తారనే నమ్మకం ఆయనలో కనిపిస్తుంది.
సెప్టెంబరులో అధికార, విపక్ష పార్టీలు టిక్కెట్లను ప్రకటిస్తామని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో టికెట్ ఆశపడి భంగపడిన వారు టీజేఎస్ లోకి వచ్చే అవకాశముందని కోదండరాం భావిస్తున్నారు. అందుకే సెప్టెంబరులోగా టీజేఎస్ ప్రజలకు చేరువవుతుందని ధీమాగా చెప్పడం వెనక ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో పొత్తులపై ఇప్పుడే లీకులు ఇవ్వకూడదనిఆయన భావిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఆలోచన చేస్తే పురిట్లో బిడ్డను చంపుకున్నట్టేనంటూ ఆయన చెప్పుకొస్తున్నారు కూడా. గతంలో పీఆర్పీ, లోక్ సత్తా, దేవేందర్ గౌడ్ పార్టీలలా కాకుండా తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా నిలబడే పార్టీగా ఉండాలని కోదండరాం ఆలోచిస్తున్నారు. మరి ఆయన ధీమాకు తగిన విధంగా ఫలితం ఉంటుందో లేదో చూడాలి.