తెలంగాణకు వాజ్ పేయి అస్తికలు..!
మాజీ ప్రధాని, దివంగత బీజేపీ నేత వాజ్ పేయి అస్తికల కలశాలను తెలంగాణకు తీసుకు వస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు. మోదీ, అమిత్ షా చేతుల మీదుగా వాజ్ పేయి అస్తికలను పంపిణీ చేశారని, తెలంగాణకు నాలుగు అస్తికలు ఇచ్చారని ఢిల్లీలో ఆయన మీడియాతో తెలిపారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రాష్ట్ర బీజేపీ కార్యాలయం వరకు వాజ్ పేయి అస్తికలను ఊరేగింపుగా తీసుకెళతామని ఆయన తెలిపారు. గురువారం ఉదయం వరకు పార్టీ ఆఫీసులో దర్శనార్థం ఉంచుతామని చెప్పారు.
మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి వాజ్ పేయి అస్తికలు కొన్ని బాసరలో కలుపుతారని, మురళీదర్ రావు, తాను పవిత్ర సంగమంలో కలుపుతామని చెప్పారు లక్ష్మణ్. వివిధ జిల్లాల్లో నివాళులు అర్పించేందుకు అస్తికలను ఉంచుతామన్నారు. వాజ్ పేయి స్ఫూర్తిగా 2019లో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వాజ్ పేయి విలువలతో కూడిన రాజకీయాలు చేశారని, ఇద్దరు సభ్యుల నుంచి పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదని కొనియాడారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఐదుగురు ఎమ్మెల్యేలమున్నామని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అంకిత భావంతో పనిచేస్తామని చెప్పారు.