‘ముందస్తు’ ఉన్నట్టా… లేనట్టా..?
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రులతో సీఎం కేసీఆర్ ఆకస్మిక భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. బుధవారం సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 11గంటల వరకు మంత్రులతో సీఎం చర్చించారు. ఏడు గంటలపాటు జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పరిస్థితి, ముందస్తు ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవని, ఒంటరి పోరేనని సీఎం ఇప్పికే స్పష్టం చేసిన నేపథ్యంలో రాజకీయంగా క్షేత్ర స్థాయి పరిస్థితిపై మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు సీఎం.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో కేడర్ సిద్ధంగా లేరనేది మంత్రులు సీఎంకు ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముందస్తుకు వెళితే ఒకే నియోజకవర్గంలో టికెట్ ఆశించే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉందని, ఆ పరిస్థితిని చక్కదిద్దాకే ఎన్నికలకు వెళ్లడం మంచిదనే అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయినా ముందస్తుకు వెళుతున్నట్లుగా తానేమీ ప్రకటన చేయలేదని మంత్రులకు సీఎం స్పష్టం చేసినట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలని, అవసరమైతే క్షేత్రస్థాయిలో ఆశావహులకు సర్థిచెప్పాలని, రాబోయేది మన ప్రభుత్వమేనని ఇతర పదవులు ఉంటాయని చెప్పాలని సీఎం సూచించారు.
కొంగరకలాన్ లో ఏర్పాటు చేసే ప్రగతి నివేదన సభ ఎన్నికల సన్నాహక సభగా ఛాలెంజింగ్ గా తీసుకోవాలని, 25లక్షలమంది సభకు హజరయ్యేలా చూడాలని మంత్రులకు సీఎం సూచించారు. జిల్లాల నుంచి కూడా జనసమీకరణ చేయడాలని చెప్పారు. ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపుగా యాభైవేల మందిని తీసుకువచ్చేలా చూడాలని , కేడర్ ను ఎన్నికలకు సిద్ధం చేయాలని సీఎం చెప్పారట. ముందస్తు పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అసలు ముందస్తు ఎన్నికలు ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అనుకున్న ప్రకారం టీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో ఎన్నికలకు సిద్ధంగా ఉందని సీఎం భావిస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తంగా నిన్న మొన్నటి వరకు ముందస్తు ఉంటుందని భావించినప్పటికీ, ప్రస్తుతపరిణామాలు మాత్రం ముందస్తు అంశం ఇప్పుడు అందరినీ డైలామాలో పడేసిందని చెప్పొచ్చు.