రివ్యూ : నీవెవరో

చిత్రం : నీవెవరో (2018)

నటీనటులు : ఆది పినిశెట్టి, రితిక సింగ్, తాప్సీ

మ్యూజిక్ : జిబ్రాన్

దర్శకత్వం : హరినాథ్

నిర్మాత : ఎంవీవీ సత్యనారాయణ

రిలీజ్ డేటు : 24ఆగస్టు, 2018

రేటింగ్ : 2.75/5

టాలీవుడ్ తీరు మారుతోంది. కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలొస్తున్నాయ్. ఈ క్రమంలో చిన్న బడ్జెట్ తో వచ్చి పెద్ద విజయాన్ని అందుకొంటున్నాయి. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100, గూఢచారి.. సినిమాలు సంచలన విజయాన్ని సాధించాయి. ఈ తరహా తెరకెక్కిన చిత్రమే ‘నీవెవరో’. హరినాథ్ దర్శకుడు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితిక సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘క్రైం అండ్ సస్పెన్స్ థ్రిల్లర్’ చిత్రమిది. కోనా కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మించారు. వైరైటీ ప్రోమోలు, టీజర్లతో అంచనాలు పెంచేసిన ‘నీవెవరో’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళ్లదాం పదండీ.. !

కథ :

కళ్యాణ్ (ఆది పినిశెట్టి) బ్లైండ్ చెఫ్. సొంతంగా రెస్టౌరెంట్’ను నడుపుతుంటాడు. కళ్యాణ్ స్నేహితురాలు అనూ (రితికా సింగ్) రిపోర్టర్. ఆమె మనసులో కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇంతలో వెన్నెల (తాప్సి) అనే కస్టమర్ రెస్టౌరెంట్ లోకి వస్తుంది. ఆమెని కళ్యాణ్ ఇష్టపడతాడు. ఆమె అడిగితే ఆర్థిక సాయం కూడా చేస్తాడు. అప్పుల ఊబిలోంచి ఆమెని బయటకు తీసుకొస్తాడు. ఇంతలో కళ్యాణ్ కు ఆక్సిడెంట్.. ఆయనకు కంటి చూపు రావడం జరుగుతోంది. ఆ తరువాత వెన్నెల అకస్మాత్తుగ కనపడక పోవడంతో.. ఆమెని వెతకడం మొదలెడతాడు కళ్యాణ్. ఇంతకీ వెన్నెల ఏమైపోయింది ? ఆమెని కళ్యాణ్ రక్షిస్తాడా.. ?? కథలో అజ్ఝాతవాసి విలన్ ఎవరు??? అనేది సస్పెన్స్ తో కూడిన మిగితా కథ.

ఎలా ఉందంటే ?

థ్రిల్లర్ కథని ఎంచుకొన్నప్పుడు.. ప్రారంభ సన్నివేశాలతోనే కథపై ఆసక్తిని కలిగేలా చేయాలి. దర్శకుడు హరినాథ్ అదే చేశాడు. అంధుడైన, ఆత్మవిశ్వాసంతో జీవితం సాగించే హీరో.. ఆయన ఇష్టపడే ఓ అమ్మాయి. సడెన్ గా హీరోకి కళ్లు వస్తాయి. ఈ ఆనందంలో ఉండగానే ఇష్టపడే అమ్మాయి మాయమైపోవడం. ఆమెని వెతికే క్రమంలో ఓ చిన్ని ట్విస్టుతో ఫస్టాఫ్ ని ముగించాడు. ఇక, సెకాంఢాప్ లోనూ వెన్నెల కోసం వేట కొనసాగింపు.. మధ్యలో వెన్నెల కిశోర్, సప్తగిరి లతో వినోదం పండించి ప్రేక్షకుడిని కాస్త రిలాక్స్ అయ్యేల చేశాడు. ఆ తర్వాత కథని సీరియస్ మూడ్ లోకి తీసుకెళ్లి.. ఓ ట్విస్టు, యాక్షన్ సీన్స్ తో కథని రక్తి కట్టించాడు. సరికొత్త కథతో ప్రేక్షకులని థ్రిల్ చేశాడు.

ఎవరెలా చేశారంటే ?

ఆది పినిశెట్టి.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు. ఛాలెజింగ్ పాత్రలు చేయడానికి ముందుండే నటుడు. ‘నీవెవరో’ సినిమాలోని అంధుడు పాత్రని ఛాలెంజ్ గా తీసుకొని చేశాడు ఆది. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యా.. ప్రతి ఆదివారం అంధుల పాఠశాలకు వెళ్లి వాళ్లతో గడిపానని చెప్పాడు ఆది. అది మంచి ఫలితాన్నిచ్చింది. అంధుడి పాత్రలో ఆది నటన చాలా బాగుంది. ఆ తర్వాత ప్రేయసి కోసం వెతికే ప్రియుడు పాత్రలో.. గత జీవితంలో తీసుకొన్న నిర్ణయాలతో నలిగిపోయే వ్యక్తి పాత్రలో ఆది నటన అద్భుతం.

ఆ తర్వాత తాప్సీ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో తాప్సీ పాత్ర ఎంత ముఖ్యమో సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది అన్నారు ఆది. అది నిజమే. ఆ పాత్రలో తాప్సీ నటన బాగుంది. ఆదిని ఇష్టపడే పాత్రలో రితికా సింగ్ నటన బాగుంది. వెన్నెల కిషోర్, సప్తిగిరి బాగానే నవ్వించారు. ‘లవర్స్’ సినిమాలో “మగజాతి ఆణిముత్యం” క్యారెక్టర్ తరహాలో ఈ సినిమాలోనూ.. “జణ గణ మణ జగదీశ్” పాత్రలో అదరగొట్టాడు.. సప్తగిరి. మిగితానటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

ఫస్టాఫ్ మాదిరిగా సెకాంఢాప్ కూడా ఇంకాస్త గ్రిప్పింగ్ సాగితే బాగుండేది అనిపించింది. కోన వెంకట్ అందించిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ బాగున్నాయి. పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫీ బాగుంది. సెకాంఢాప్ లో కొన్ని సన్నివేశాలని కత్తెరపెట్టొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

‘నీవెవరో.. సస్పెన్స్‘.. చూసి తెలుసుకోండీ.. !

రేటింగ్ : 2.75/5