తెలంగాణలో కేసీఆర్ మార్క్ పాలిటిక్స్..
రాజకీయంగా ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట. ఆ విషయంలో కేసీఆర్ రెండాకులు ఎక్కువే అనడంలో అతిశయోక్తి లేదు. భవిష్యత్ ను అంచాన వేస్తూ అందుకు తగినట్టుగా ప్రణాళికలు వేసుకుంటూ ముందుకెళుతుంటారాయన. వచ్చే ఎన్నికల్లో విపక్షాలను చిత్తు చేయడానికి ముందస్తు వ్యూహంతో ముందుకెళుతున్నారు మఖ్యమంత్రి. సెప్టెంబర్2న ప్రగతి నివేదన సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే సభ తేదీ, వేదికను ప్రకటించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం కేసీఆర్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం తెలంగాణలో రాజకీయాలను మరింత వేడెక్కిస్తుంది. ముందస్తుకు వెళ్లడం ఖాయమని ఊహించినా అసలు కేసీఆర్ వ్యూహం ఏంటి, ఆయన ఏం చేయాలనుకుంటున్నారనేది విపక్షాలకు, రాజకీయ వర్గాలకు అంతుబట్టడంలేదు. టీఆర్ఎస్ఎల్పీలో పార్టీ శ్రేణులకు ముందస్తుకు సిద్ధంగా ఉండాలనే సంకేతాలు ఇస్తూనే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ మరో వ్యాఖ్య చేయడం అందరినీ కొంత అయోమయానికి గురి చేస్తోంది.
ఎమ్మెల్యేలు, మంత్రులతో జరిగిన సమావేశంలో ఎవరి ఫోన్స్ ను, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించడపోవడం, రహస్యసమావేశాన్ని తలపించేలా సమావేశం నిర్వహించడం కూడా కేసీఆర్ ఎంత పకడ్బందీగా వ్యూహరచన చేసుకున్నారో అర్థమవుతోంది. ప్రజా ప్రతినిధులపైనా నిఘా పెట్టి ఇతర పార్టీల వైపు చూడకుండా, సమాచారాన్ని చేరవేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవైపు హైదరాబాద్ లో పార్టీనేతలతో చర్చలు, మరో వైపు ఢిల్లీలో ప్రధాని, కేంద్రమంత్రులు, ఎన్నికల అధికారులతో మంతనాలు.. ఇలా వరుసగా తన పని తాను చేసుకుపోతున్న కేసీఆర్ చర్యలతో అసలేం జరుగుతుందో తెలియక రాజకీయ వర్గాల్లో చాలామంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతేకాదు మీడియాకు ఒకింత ఆయన వ్యవహారం అర్థం కావడం లేదట. అందుకే ఈ గులాబీ బాస్ అసలు ఎవరికీ చిక్కడు.. దొరకడు కదా అనుకుంటున్నారు అంతా. చూడాలి మరి భవిష్యత్ రాజకీయాలలో కేసీఆర్ మార్క్ ఎలా పనిచేస్తుందో.