టీ-అసెంబ్లీ రద్దుకు మూడు ముహూర్తాలు…!?
తెలంగాణలో ముందస్తు ఎన్నికలసంకేతాల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.. ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పార్టీ నేతలను సమాయత్తం చేసిన కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసేందుకు ముహూర్తాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగానే జాతకాలు, ముహూర్తాలు ఫాలో అయ్యే ఆయన ఇప్పుడు ముందస్తు ఎన్నికల విషయంలోనూ వాటిని బలంగా నమ్ముతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇందులోభాగంగా అసెంబ్లీ రద్దుకు మూడు ముహూర్తాలు పరిశీలించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
సెప్టెంబరు 6న ఏకాదశి రోజునగానీ, లేక మరుసటి రోజు 7న మధ్యాహ్నంలోపు గానీ అసెంబ్లీ రద్దుకు ముహూర్తాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తారాబలం పరంగా చూస్తే సెప్టెంబరు 12, భాద్రపద శుద్ద తదియ కూడా కేసీఆర్ కు అనుకూలంగానే ఉందని పండితులు చెబుతున్నారు. అయితే కేసీఆర్ లక్కీ నెంబర్ 6 కాబట్టి కారు నంబరుతో సహా ఆయన 6ను సెంటిమెంట్ గా భావిస్తారు. అదీగాక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలలో డిసెంబరు 15లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరగాలంటే దాదాపు సెప్టెంబరు 6నే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు వెళ్లే అవకాశం కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.