ముహూర్తం కోసమే ‘ముందస్తు’కా..?
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ అస్థిరత లేదు.. అధికార పార్టీ బలహీనంగా ఉందా అంటే అదీ లేదు.. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే కేసీఆర్ ఆకర్ష్ అస్త్రానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి క్యూకట్టారు. దీంతో టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో బలాన్ని పుంజుకుని దూసుకుపోతుంది. ఇక సొంత పార్టీలో అసమ్మతి వినిపించడం సంగతి సరేసరి.. కేసీఆర్ కు భయపడి అసమ్మతి రాగం వినిపించేంత సాహసం ఎవరూ చేయలేరు. ఇక విపక్షాల సంగతీ అంతే. కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు విపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి . ఇన్ని పాజిటివ్ అంశాలున్నా సీఎం కేసీఆర్ ముందస్తుకు ఎందుకు తహతహలాడుతున్నారనేదానిపై ఓరేంజ్ లో చర్చ మొదలైంది.
వాస్తు, జ్యోతిష్య, సంఖ్యా శాస్త్రాలను బలంగా నమ్మే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు పై కూడా అదే నమ్మకంతో ముందుకెళుతున్నారనే చర్చ రాష్ట్రంలో మొదలైంది. సచివాలయం వాస్తు లేదని అటువైపు వెళ్లడమే మానేసిన కేసీఆర్ ప్రగతి భవన్ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అంతలా ఆయనకు వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలపై నమ్మకముంది. డిసెంబరులోపు ఎన్నికలు జరిగితే కేసీఆర్ కు తిరుగుండదని ఓ పండితుడు చెప్పడం వల్లే ఆయన ముందస్తుకు వెళుతున్నారంటూ ఓ వర్గం చర్చించుకుంటున్నారు. ముహూర్తాలను బలంగా నమ్మే కేసీఆర్ ముందస్తు విషయంలోనూ అదే చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా ఉన్న పార్టీ కాంగ్రెస్. ప్రస్తుతానికి కాంగ్రెస్ అంత బలంగా లేకపోయినా, ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో బలపడి రాజకీయంగా టీఆర్ఎస్ పరిస్థితి తారుమారైనా ఆశ్చర్యపోనవసరంలేదు. ఈ పరిస్థితిని ముందుగానే గమనించిన కేసీఆర్ విపక్షాలు బలపడకముందే ఎన్నికలకు వెళితే ఇక తనకు తిరుగు లేకుండా చేసుకోవచ్చని భావిస్తున్నారని, ముహూర్తబలమూ తనకు అనుకూలంగా ఉన్న సమయంలో ముందస్తుకు వెళితే తన నమ్మకంతో పాటు, విపక్షాలను చిత్తు చేయవచ్చే ఆలోచనతోనే కేసీఆర్ ముందస్తుకు వెళుతున్నారని మరికొందరు చర్చించుకుంటున్నారు. మొత్తంగా జాతకాలపై నమ్మకంతోనో, లేక రాజకీయ వ్యూహంతోనో కేసీఆర్ మోగించిన ముందస్తు సైరన్ రాష్ట్రంలో ఓ రేంజ్ లో పొలిటికల్ హీట్ పెంచేసింది.