బాలీవుడ్ ‘కత్తి’ పట్టేదెవరు ?
దర్శకుడు మురగదాస్ సినిమాలు బాలీవుడ్ కూ వెళ్తుంటాయి. టాలీవుడ్, కోలీవుడ్ లోనూ సూపర్ హిట్టయిన ‘గజనీ’ సినిమాని బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో అదే పేరిట రిమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మురగ. విజయ్ తో చేసిన ‘తుపాకి’ సినిమాని అక్షయ్ కుమార్ తో ‘హాలీడే’గా తీసి హిట్ కొట్టాడు. ‘తుపాకి’ తర్వాత మురగదాస్ విజయ్ తో చేసిన ‘కత్తి’ సంచలన విజయాన్ని అందుకొంది. తెలుగులో ఈ సినిమా రిమేక్ తో రీ-ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. తమిళ ‘కత్తి’ని ‘ఖైదీ నెం.150’గా తీసుకొచ్చి రికార్డులని తిరగరాశాడు. ఇప్పుడీ కత్తి బాలీవుడ్ కు వెలుతోంది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘కత్తి’ రిమేక్ రైట్స్ ని తీసుకొన్నారు. ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ల పేర్లు వినిపిస్తున్నాయి. తెలుగు చిత్రం ‘విక్రమార్కుడు’ను ‘రౌడీ రాథోడ్’గా, తమిళ చిత్రం ‘రమణ’ను ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ పేరుతో హిందీలో నిర్మించి విజయాన్నందుకున్నారు భన్సాలీ. మరో వైపు రణ్వీర్తోనూ భన్సాలీకి మంచి అనుబంధం ఉంది. ‘పద్మావత్’, ‘రామ్లీల’, ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రాలకు వారిద్దరూ కలసి పనిచేశారు. వీరిద్దరిలో ఎవరు ‘కత్తి’ పడతారన్నది చూడాలి.