అభిమానులకు అదే ఆయన చివరి లేఖ.
సెప్టెంబర్ 2న హరికృష్ణ జన్మదినం సందర్భంగా హరికృష్ణ అభిమానులకు లేఖ రాసారు. అదే ఆయన చివరి లేఖ అవుతుందని ఎవరూ ఊహించలేదు. పుట్టినరోజున అభిమానులకు సందేశం ఇవ్వాలని ముందుగా రాసి పెట్టుకున్న ఈ లేఖ ఆయన మరణించిన తర్వాత బయటికి వచ్చింది. ‘‘సెప్టెంబర్ 2న అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బేనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను.. ఇట్లు- మీ నందమూరి హరికృష్ణ’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.