హరికృష్ణ ఎక్కడకు వెళ్ళినా ఆ ఇద్దరూ తోడుండాల్సిందే..
హరికృష్ణ ఎక్కడకు వెళ్లినా అతని ఇద్దరు సన్నిహిత మిత్రులు ఆయన వెంట ఉండాల్సిందే. ముప్పై ఏళ్లుగా హరికృష్ణతో స్నేహం కొనసాగిస్తున్న ఆ ఇద్దరు ప్రమాద సమయంలోనూ కారులో ఆయన తో ఉన్నారు. హరికృష్ణతో పాటు ఆయన వాహనంలో ఉన్న రావి వెంకట్రావు, శివాజి ఇద్దరూ హరికృష్ణ ఎప్పుడు బయటకు వెళ్లినా ఆయనతోనే ఉంటారు. కృష్ణా జిల్లాకు చెందిన వీరిద్దరూ హైదరాబాద్ లోనే ఉంటారు. ఎప్పటి నుంచో హరికృష్ణకు స్నిహిత మిత్రులు. హైదరాబాద్‌లో ఉంటే హరికృష్ణ తరచూ వెంకట్రావు డెయిరీ ఫారంకు వెళ్లి అక్కడ ఎక్కువసేపు గడుపుతారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళతారు.
హరికృష్ణకు ఆపరేషన్ జరిగినప్పటి నుంచి ఆయన వాహనాలు ఎక్కువగా నడపడం లేదు. నెల్లూరులో జరగనున్న పెళ్లికి వెళ్లడానికి బుధవారం తెల్లవారు జామున 4.30 గంటలకు హరికృష్ణ తానే వాహనం నడుపుతూ వచ్చి వెంకట్రావు, శివాజిలను ఎక్కించుకున్నారు. వెంకట్రావు తాను నడుపుతానంటే దారిలో టిఫిన్ చేసిన అనంతరం ఇస్తాలే అని బయలుదేరారట హరికృష్ణ. టిఫిన్‌కు ఆగకముందే జరిగిన ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న హరికృష్ణ మృతి చెందగా, పక్క సీటులో కూర్చున్న శివాజి, వెనుక సీటులో కూర్చున్న వెంకట్రావు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.