అధికారంలోకి రాగానే ఆ పని ఖచ్చితంగాచేస్తాం..
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్ అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు. కేసీఆర్ నిర్వహిస్తున్న సభ ప్రగతి నివేదన సభ కాదని, అది ప్రగతి ఆవేదన సభ అని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసి .. ప్రగతి నివేదన సభ పేరుతో ధన ప్రదర్శన చేస్తున్నారని ఆయన విమర్శించారు. మన సొమ్ము దోచుకుని మనకే ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు.
సభకు 3వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఒక్కొక్కరికి 5 వందల రూపాయలిచ్చి జన సమీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫీ-రీయంబర్స్ మెంట్ , దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదని ఆయన అన్నారు. టిఆర్ఎస్ లూటీ చేసిన ధన ప్రదర్శనే ప్రగతి నివేదన సభ అని ఆయన విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం రాబోతుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.