‘సైరా’లో సుదీప్ లుక్.. ఇదే !

మెగాస్టార్ చిరంజీవి బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించేశాడు. ఆయన 151 చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఇందులో కన్నడ నటుడు సుదీప్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆదివారం సుదీప్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా’లో ఆయన పాత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. “మా అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్‌నకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సైరా నరసింహారెడ్డిలోని ‘అవుకు రాజు’ డైనమిక్‌ లుక్‌ మీకోసం’’
అంటూ కొణిదల ప్రొడక్షన్‌ కంపెనీ సుదీప్‌ పోస్టర్‌ ను అభిమానులతో పంచుకుంది.

ఈ చిత్రంలో సుదీప్‌ ‘అవుకు రాజు’ అనే పాత్రలో నటిస్తున్నారు. నల్లని దుస్తులు ధరించిన సుదీప్‌ కోర మీసాలు, గడ్డంతో పాటు కుడి భుజంపై గొడ్డలి, ఎడమవైపు ఒరలో కత్తితో ఓ వీరుడిలా నిలబడ్డారు. ఇక, ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్, నయనతార, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, తమన్నా తదితరులు కీలక పాత్రలు నటిస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్‌ తదితర భాషల్లోనూ ‘సైరా’ని విడుదల చేయనున్నారు.