కేబినెట్ భేటీలో ఆ ముచ్చ‌టే రాలేద‌ట‌..

ఒక‌వైపు ప్ర‌గ‌తి నివేద‌న స‌భ జ‌రగాల్సి ఉన్న నేప‌థ్యంలో ఉత్కంఠ రేపిన కేబినెట్ భేటీ ముగిసింది. ముంద‌స్తుపై కీల‌క నిర్ణ‌యం ఉంటుంద‌ని అంతా భావించిన‌ప్ప‌టికీ అస‌లు కేబినెట్ లో ఆ అంశంపై చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని మంత్రులు ప్ర‌క‌టించారు. కేబినెట్ భేటీకి సంబంధించిన నిర్ణ‌యాల‌ను మంత్రులు ఈటెల రాజేంద‌ర్ , హ‌రీష్ రావు, క‌డియం మీడియాకు వెల్ల‌డించారు.

బీసీలకు హైదరాబాద్‌లో 70 కోట్లతో 71 ఎకరాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ కోసం మరో 5 ఎకరాలు కేటాయింపు, గోపాల మిత్రులకు వేతనం 3,500 నుంచి 8500 పెంపు, అర్చకుల పదవీ విరమణ వయసు 58 నుంచి 65 ఏండ్లకు పెంపు, ఆశా కార్యకర్తల గౌరవ వేతనం 6 వేల నుంచి 7500లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నార‌న్నారు.

వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంలుకు 11 వేల నుంచి 21 వేలకు పెంపు, ఎన్‌యూహెచ్‌ఎంలో పని చేస్తున్న 9 వేల మందికి కనీస వేతనాలు పెంచుతూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. కాంట్రాక్ట్ డాక్టర్ల వేతనం 40 వేలకు పెంచినట్లు ప్ర‌క‌టించారు. త్వరలోనే మరోసారి కేభినేట్ భేటి ఉంటుందని అందులో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్న‌ట్లు మంత్రులు తెలిపారు.