ముందస్తు పై ప్రకటన చేసిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుపై ప్రకటన చేశారు. కొంగరకలాన్ వేదిక జరుగుతున్న టీఆర్ఎస్ ‘ప్రగతి నివేదన సభ’కు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సుదీర్ఘంగా ప్రసంగించిన సీఎం కేసీఆర్.. ఉద్యమ ప్రస్థానాన్ని మరోసారి ప్రస్తావించారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడేందుకు పిడికిలి బిగించిన నాటి నుంచి.. తెలంగాణ రాష్ట్ర కల సాకారం కోసం పడిన తాపత్రాయాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. నాలుగేళ్లలో ఏం చేశాం. ఇకపై ఏం చేయబోతున్నామన్నది సూటిగా సుత్తిలేకుండా చెప్పారు. ఈ వేదికగా కేసీఆర్ ముందస్తుపై ప్రకటన చేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అనుకొన్నట్టుగానే కేసీఆర్ ముందస్తుపై స్పందించారు.
‘ముందస్తు వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకొనే బాధ్యతని కేబినేట్ నాపై ఉంచింది. ఈ వేదికగా తాను ముందస్తుపై ప్రకటన చేస్తానని జోరుగా ప్రచారం కూడా జరిగింది. ఆ విషయాన్ని ఈ వేదికగా మేం ప్రకటించ వచ్చు కూడా. ఐతే, ఆ విషయంపై రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొనే సరైన సమయంలో నిర్ణయం తీసుకొంటాం’ అని కేసీఆర్ తెలిపారు. దీంతో ప్రగతి నివేదన సభ ఎలాంటి సప్రైజ్ లు లేకుండానే.. ఓ సాదాసీదా టీఆర్ ఎస్ సభలా ముగిసిందని చెప్పవచ్చు. ప్రగతి నివేదన సభతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు దాదాపు జరగడం లేదనే విషయం స్పష్టమైంది.