‘ముందస్తు’కు ముహూర్తం కుదరలేదా..?
ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకోపన్యాసం చేస్తారని, ఎన్నికల నగారా మోగిస్తారని, ఏదో ఒక సందేశం ఇస్తారని , విపక్షాలను కౌంటర్ ఎటాక్ చేస్తారని భావించిన టీఆర్ఎస్ నేతలకు , అభిమానులకు నిరాశే మిగిలింది. వ్యూహాత్మకమో, ఇంకేదో తెలియదు కానీ కేసీఆర్ ప్రసంగంలో ఆ జోష్ కనిపించలేదనేది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట. ముందస్తుకు సిద్ధమా అంటూ అంతకుముందు సవాల్ విసిరిన టీఆర్ఎస్ నేతలు సభలో మాత్రం ఆ ప్రస్తావనే తీసుకురాకపోవడం, కేవలం రాజకీయ నిర్ణయాలు ఉంటాయని మాత్రమే చెప్పడం కేసీఆర్ శైలికి భిన్నంగా కనిపించాయి.
ప్రగతినివేదన సభరోజునే కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడం కూడా ముందస్తు ఊహాగానాలకు బలాన్ని చేకూర్చింది. అయితే సమావేశంలో అలాంటిదేమీ చర్చకు రాలేదని మంత్రులు ప్రకటించడం, ఆ బాధ్యతను అంతా తనపై ఉంచారని, సమయం వచ్చినపుడు రాజకీయ నిర్ణయాలను కూడా తీసుకుని ప్రజలకు చెబుతానని కేసీఆర్ సభలో చెప్పడం ముందస్తుపై సీఎం కేసీఆర్ ఇంకా సస్పెన్స్ ను కొనసాగించారని చెప్పొచ్చు. అయితే మరోసారి కేబినెట్ భేటీ ఉంటుందనేది మాత్రం స్పష్టం చేశారు.
వచ్చే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, యుద్ధ చతురతను ప్రదర్శిస్తున్నారని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ముహూర్త బలాన్ని నమ్మే కేసీఆర్ అందుకనుగుణంగానే ముందస్తుప్రకటన చేయవచ్చనేది ఓ వర్గం వినిపిస్తున్న వాదన. వచ్చే కేబినెట్ భేటీ తరువాత అనుకూల ముహూర్తంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి అప్పుడే ముందస్తుకు వెళతారని ఓ టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ముహూర్తం కుదరకే ప్రగతి నివేదన సభలో ముందస్తు అంశాన్ని పక్కనబెట్టారనేది స్పష్టంగా కనిపిస్తోంది.