రాయ‌ల‌కాలంనాటి ఆభ‌ర‌ణాలేవీ…? టీటీడీని ప్ర‌శ్నించిన కేంద్ర స‌మాచార క‌మిష‌న్ !

తిరుమల వేంకటేశ్వర స్వామికి 16వ శతాబ్దంలో విజయనగర మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన
ఆభరణాలు ఎక్కడ ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, టీటీడీని కేంద్ర సమాచార కమిషన్ ప్రశ్నించింది.
దానికి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ), దేవదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీల‌ను ఆదేశించింది.

ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు టీటీడీకి ఉందని, శాసనాల్లో ఉన్న నగలకు, అక్కడ ఉన్న నగలకు అస్సలు పోలికే లేదని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కు చెందిన ఒక డైరెక్టర్ చెప్పారని ఆర్టీఐ క‌మిష‌న‌ర్ మాడ‌భూషి శ్రీ‌ధ‌ర్ అన్నారు. ఆ నివేదికపై సమాచారం కావాలని ఆర్టీఐ ద్వారా అడిగితే జవాబు చెప్పి తీరాల్సిందేన‌ని ఆయ‌న చెప్పారు.

వేల కోట్లు ఖర్చుచేసే ప్రభుత్వ సంస్థలు ప్రజలకు జవాబుదారిగా ఉండాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చానని ఆయ‌న తెలిపారు. సెప్టెంబర్ 28న తుది విచారణ ఉంటుందని, జవాబుదారిగా ఉండటానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలను చెప్పుకోవచ్చుని అన్నారాయ‌న‌.