మహేష్ కోసం అల్లరోడు.. ప్రాణమిస్తాడట !

కామెడీ హీరో అల్లరి నరేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై విపరీతమైన అభిమానాన్ని పెంచుకొన్నాడు. మహేష్ ‘మహర్షి’ సినిమాలో అల్లరోడు కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో నరేష్ మహేష్ స్నేహితుడిగా కనిపించబోతున్నాడు. ఈ అవకాశం కేవలం వంశీ పైడిపల్లి వల్ల రాలేదంటున్నాడు అల్లరోడు. ఆ పాత్రను నేనైతేనే బాగుంటుందని స్వయంగా మహేష్ కూడా ఫీలయ్యాడని, అందుకే మహర్షి సినిమాలో అవకాశం వచ్చిందని, మహేష్ నమ్మకాన్ని నిలబెడతానని అంటున్నాడు అల్లరోడు.

అంతేకాదు.. సినిమాలో తన పాత్ర గురించి కొన్ని క్లూస్ వదిలాడు నరేష్. గమ్యంలో గాలిశీను, శంభోశివశంభో సినిమాలో మల్లిగాడు పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. మహర్షిలో తన క్యారెక్టర్ అలా నిలిచిపోతుందని తెలిపాడు. ఈ రెండు సినిమాల్లోనూ నరేష్ పాత్ర స్నేహితుల కోసం ప్రాణమిచ్చేలా ఉంటుంది. ‘గమ్యం’ సినిమాలో స్నేహితుడు శర్వానంద్ కోసం గాలి శ్రీను ఏకంగా ప్రాణాలు ఇస్తాడు. ‘శంభోశివశంభో’లోనూ స్నేహితుల కోసం ప్రాణమిచ్చే మల్లిగాడిని చూశాం. ఇప్పుడు ‘మహర్షి’లోనూ మహేష్ కోసం ప్రాణలిచ్చే పాత్రలో నరేష్ కనిపించబోతున్నట్టు సమాచారమ్. సినిమాలో స్నేహితుడు నరేష్ పాత్ర చనిపోయాకే మహేష్ రైతు సమస్యలపై పోరాటం మొదలెడతాడని చెబుతున్నారు.

ఇక, ఈ సినిమాలో మహేష్ ది గెస్ట్ రోల్ కాదట. ఆయన పాత్ర సినిమా మొత్తం కనిపిస్తుందట. “దాదాపు సినిమా మొత్తం కనిపిస్తాను. ఇప్పటికే 45 రోజులు షెడ్యూల్ అయింది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఆ సినిమా సెట్స్ పైనే ఉంటాను. మరో వంద రోజులు మహర్షి సెట్స్ పైనే ఉండబోతున్నా’నని తెలిపారు. మొత్తానికి మహేష్ కోసం ప్రాణమిచ్చే స్నేహితుడి పాత్రలో అల్లరోడు కనిపించబోతున్నాడు. ఈ స్నేహితులిద్దరి కథని తెరపై చూడానికి వచ్చే యేడాది వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే.