తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల శంఖారావం.
అసెంబ్లీ రద్దు తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సెంటిమెంట్ ప్రకారం హుస్నాబాద్ లో ప్రజా ఆశిర్వాద సభ పేరుతో నిర్వహిస్తున్న సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు కేసీఆర్. నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ ను మళ్ళీ ఆశీర్వదించాలని ప్రజలకు సభద్వారా విన్నవించనున్నారు. రద్దు తరువాత తొలి సభ కావడంతో సభలో కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
అభ్యర్థులకు సంబంధించి 105మందిని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సభలో ఎన్నికల హామీలపై కీలక ప్రకటనలు చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచే హామీలను సభలో కేసీఆర్ ప్రస్తావించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ బాధ్యత కేకే కు అప్పగించారు. కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల హామీలను ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ కు ధీటుగా కేసీర్ ప్రకటనలు చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే సభ ఏర్పాట్ల బాధ్యతను హరీష్ రావు, ఈటెల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భారీ సంఖ్యలో జనం హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. సభకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఫాం హౌస్ నుంచి కేసీఆర్ కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం హుస్నాబాద్ సభకు హాజరవుతారు కేసీఆర్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హుస్నాబాద్ నుంచి సభ నిర్వహించడం కేసీఆర్ కు ఆనవాయితీగా వస్తోంది. మొత్తంగా హుస్నాబాద్ సభతో టీఆర్ఎస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.