జగ్గారెడ్డి అరెస్ట్.. సంగారెడ్డిలో ఉద్రిక్తత !

మ‌నుషుల అక్ర‌మ ర‌వాణా కేసులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. భార్యా పిల్లల పేరుతో ఇతరులను అమెరికాకు తీసుకెళ్లి వారిని అక్కడే వదిలి వచ్చారని ఆరోపణలపై ఆయన్ని అదుపులోనికి తీసుకొన్నారు. సోమవారం పటాన్‌చెరులో ఆయన ఓ కార్యక్రమంలో ఉండగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు.

2004లో ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలోనే కుటుంబ సభ్యుల పేర్లతో జగ్గారెడ్డి ముగ్గురిని అక్రమంగా అమెరికా తీసుకెళ్లారని పోలీసులు చెబుతున్నారు. నెల రోజులు ఉండి తిరిగి భారత్‌కు వచ్చారని పేర్కొంటున్నారు. ఇటీవల జగ్గారెడ్డి పాస్‌పోర్టు పోయిందంటూ కొత్త పాస్‌పోర్టుకు దరఖాస్తు చేశారని పేర్కొంటున్నారు. అమెరికా స్టాంపింగ్‌ నుంచి తప్పించుకోవడానికే ఇలా చేశారంటూ పోలీసులు పేర్కొంటున్నారు.

ఐతే, జగ్గారెడ్డి అరెస్టు రాజకీయ కుట్రలో భాగమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2004లో తప్పుడు పత్రాలు సమర్పిస్తే ఇప్పటివరకు అధికారులు ఏం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా పనిచేసిన జగ్గారెడ్డిని పోలీసులు సివిల్‌ డ్రెస్‌లో వచ్చి అరెస్టు చేయాల్సిన పని ఏమొచ్చిందని నిలదీశారు. అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.

జగ్గారెడ్డి అరెస్టుతో సంగారెడ్డిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారని, అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ సంగారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చింది. ఇక, ఈ దఫా ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ కుట్ర చేశారన్నది జగ్గారెడ్డి వర్గాల వాదన.