‘అరవింద సమేత’ పండగ గిఫ్ట్ అదిరింది.. కానీ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఎట్టుట్టదో ‘అరవింద సమేత’ టీజర్’తో అర్థమైపోయింది. తారక్ మార్క్ యాక్షన్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ టీజర్ లో హైలైట్ గా నిలిచాయి. అవి సినిమాపై అంచనాలని రెట్టింపు చేశాయి. ఇక, వినాయక చవితి కానుకగా ఈ సినిమా నుంచి రెండో టీజర్ రాబోతున్నట్టు ప్రచారం జరిగింది. మరో టీజర్ రాలేదు. కానీ, పండగ గిఫ్ట్ వచ్చేసింది.

వినాయక చవితి కానుకగా ‘అరవింద సమేత’ నుంచి కొత్త పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. స్టయిలీష్ లుక్ లో ఉన్న తారక్ పోస్టర్ తో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టర్ లోనే ఈ నెల 20న ఆడియో విడుదల కాబోతుందని తెలిపారు. ఐతే, ఆడియో వేడుక గురించి ప్రస్తావించలేదు. దీంతో.. నేరుగా ఆడియోని నెట్ లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

పండగ గిఫ్ట్ తో ఆనంద పడుతున్న తారక్ అభిమానులకు.. రెండో టీజర్ రాకపోవడం, ఆడియో వేడుక లేదని తెలవడం కాస్త నిరాశకు గురిచేస్తోంది. ఐతే, ఆ నిరాశనంతా దూరం చేసి జోష్ నింపేలా ఉంది ‘అరవింద సమేత’ వినాయక చవితి పండగ గిఫ్ట్. పోస్టర్ లో తారక్ ని చాలా అందంగా చూపించారు. ఇప్పుడీ పోస్టర్ ని చూసి నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న తొలి చిత్రమిది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అదే యాసలో ఎన్టీఆర్ డైలాగ్స్ ఉండనున్నాయి. ఇందుకోసం తారక్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకొన్నారు. సిక్స్ ప్యాక్ బాడీతో కొత్త లుక్ లో కనిపించనున్నారు తారక్. ఆయన సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం. రాథాకృష్ణ నిర్మాత.