రివ్యూ : సామి

చిత్రం : సామి

నటీనటులు : విక్రమ్, కీర్తి సురేష్

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

దర్శకత్వం : హరి

నిర్మాతలు : బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్

రిలీజ్ డేట్ : 21 సెప్టెంబర్, 2018

రేటింగ్ : 2.5/5

మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసన దర్శకుడు హరి. దాదాపు 15 యేళ్ల క్రితం హరి దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సామి’ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా సీక్వెల్ గా ‘స్వామి స్కేర్’ని రూపొందించారు. తెలుగులో ‘సామి’ పేరుతోనే విడుదల చేశారు. మరీ.. ఈ సీక్వెల్ ఎలా ఉంది ? మరోసారి ‘సామి’ మాస్ ని మైమరిపించాడా.. ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

విజయవాడలో పెద్ద రౌడీ రావణ బిక్షు (బాబీ సింహ). సోదరులు దేవేంద్ర బిక్షు, మహేంద్ర బిక్షు అండదండ చూసుకొని రెచ్చిపోతుంటాడు. ఇలాంటి సమయంలో ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని విజయవాడలో ఎంటరైన రామస్వామి (విక్రమ్) బిక్షు బ్రదర్స్ కి చుక్కలు చూపిస్తాడు. వారి అక్రమ వ్యాపారాలను దెబ్బతీయడంతో పాటు, పగబట్టి ఒక్కొక్కరినీ చంపేస్తుంటాడు. రామస్వామికి పోలీస్ వ్యవస్థ సపోర్ట్ కూడా ఉంటుంది. అసలు ఎవరీ రామస్వామి ? రావణ బిక్షుకు, రామస్వామికి ఏమిటి సంబంధం? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

* విక్రమ్, బాబీ సింహాల నటన

మైనస్ పాయింట్స్ :

* రోటీన్ స్టోరీ

* ఫస్టాఫ్

* ఎడిటింగ్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

పవర్ ఫుల్ పోలీస్ స్టోరీస్ ని డీల్ చేయడంలో హరి దిట్ట. ఆయన పనితీరుని సింగం సిరీస్ లో చూశాం. సామి కూడా ఈ కోవకు చెందినదే. ఐతే, కొత్తదనం లేదు. రొటీన్ పోలీస్ డ్రామాగా ‘సామి’ తీసుకొచ్చాడు. ఈ రొటీన్ కథని తన అద్భుతమైన నటనతో నిలబెట్టే ప్రయత్నం చేశాడు విక్రమ్. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ అదరగొట్టాడు. ఏ సీన్లోనూ తగ్గకుండా దడదడలాడించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రకు వందకు వందశాతం న్యాయం చేశాడు.

విక్రమ్ కి జంటగా నటించిన కీర్తి సురేష్ కు నటించే స్కోప్ దక్కలేదు. పాటలు, తనకు దక్కిన కొద్దిపాటి అవకాశాన్ని కీర్తి సద్వినియోగం చేసుకొంది. సినిమాలో కాస్త బొద్దుగా కనిపించింది. తమిళ ప్రేక్షకులు బొద్దు అందాలని ఇష్టపడుతుంటారు బహుశా.. ఆ కారణంగానే కీర్తి లావెక్కి ఉంటుందేమో.. ! మరో హీరోయిన్ ఐశ్వర్యరాజేష్ ఒక పాటతో పాటు ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో విక్రమ్‌కు జోడీగా ఆకట్టకుంది.

ప్రతినాయకుడు బలంగా ఉంటేనే.. కథానాయకుడి మరింత బలంగా చూపించొచ్చు. ఇందులో విలన్ పాత్ర పోషించి తమిళ నటుడు బాబీ సింహా క్రూరత్వానికి మారుపేరుగా పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు. సినిమాలో విక్రమ్ తర్వాత బాగా హైలెట్ అయిన పాత్ర ఇదే. కేంద్ర మంత్రి పాత్రలో ప్రభు, దేవంద్ర బిక్షు పాత్రలో జాన్ విజయ్, మహేంద్ర బిక్ష పాత్రలో సుందర్, కమెడియన్ సూరి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దేవిశ్రీ సినిమాల రేంజ్ లో లేదనిపించింది. వెంకటేష్ అంగురాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో కత్తెర పెట్టాల్సిన సీన్ ఇంకా ఉన్నాయనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : సామి.. రొటీన్

రేటింగ్ : 2.5/5