కాంగ్రెస్-టీడీపీ చీకటి ఒప్పందం బట్టబయలు !

తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ కలయిక అనైకం అంటూ టీఆర్ఎస్ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తుతో మళ్లీ తెలంగాణని ఆంద్రోళ్ల చేతిలో పెడతారా.. ? అమరావతికి తాకట్టు పెడతారా.. ?? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడీ రెండు పార్టీల చీకటి ఒప్పందాన్ని కూడా బయటపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. మంగళవారం జరిగిన నిజామాబాద్ ఆశీర్వాదసభలో కాంగ్రెస్, టీడీపీ, భాజాపాలని చీల్చి చెండాడారు.

ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ టీడీపీతో ఎలా పొత్తుపెట్టుకుంటుందని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దయ్యాలకు అప్పగిస్తారా? తెలంగాణను నాశనం చేసిన చంద్రబాబుతో పొత్తా? అడుక్కుంటే కాంగ్రెస్‌కు మేమే నాలుగు సీట్లు ఇస్తాం కదా. కరెంటు ఇవ్వకుండా రాక్షసానందం పొందిన రాక్షసి చంద్రబాబు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి 36 లేఖలు రాసిన దుర్మార్గుడు దుయ్యబట్టారు.

చంద్రబాబుతో కలుస్తున్నామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.. మన పవర్‌ ప్లాంటు, ఏడు మండలాలను గుంజుకున్నాడు చంద్రబాబు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాడు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం కోసం రూ.500 కోట్లు ఇస్తాడట. మూడు హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నాడట. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా ? చావు నోట్లో తలపెట్టి తెచ్చుకున్న తెలంగాణను అమరావతికి పంపిస్తారా ? మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తారా ? ప్రశ్నించారు.