సైరా : అమితాబ్ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్

మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలి తరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవాళ బిగ్ బీ అమితాబ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సైరా’లో ఆయన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో బిగ్
నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించబోతున్నాడని తెలిపారు. ఈ మేరకు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధికార ట్విట్టర్ ఖాతా నుంచి ట్విట్ చేసింది. బిగ్ బీ తీక్షణంగా చూస్తున్న లుక్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. అస్సలు బడ్జెట్ గురించి ఆలోచించడం లేదు. నాన్న కోసం ముందు వెనక చూడకుండా ఖర్చు పెడుతున్నాం. ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా ఇవ్వాలన్నది మాత్రం ఆలోచిస్తున్నామని రామ్ చరణ్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇక, బాహుబలి రేంజ్ లో సైరా విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో విడుదల చేయనున్నారు.

ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, జగపతి బాబు, తమన్నా.. తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.