మెగాస్టార్ మొహం చాటేశాడు

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ వీడబోతున్నట్టు గత కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ ప్రచారం నిజమేనని దాదాపు తేలిపోయింది. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగిసింది. అయినా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు.
అంతేకాదు.. ఎన్నికల వేళ క్రియాశీలకంగా వ్యవహరించాలని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పినా పట్టించుకోలేదు. దీంతో చిరు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పినట్టేనని తెలుస్తోంది.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి.. దానికి ఫలితంగా కేంద్ర మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన జరగడం, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం, కేంద్రంలోనూ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చిరు సైలైంట్ అయిపోయారు. సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆయన రీ-ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెం.150 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. టాలీవుడ్ లో మెగాస్టార్ స్థానం ఇప్పటికీ నెం. 1 అని ఆ చిత్రం నిరూపించింది. ఆ జోష్ లోనే చిరు 151 చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ చేస్తున్నారు.

తొలి స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకుడు. దాదాపు రూ. 200కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత కూడా చిరు మరిన్ని సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకొంటున్నారు. సైరా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది రైతు నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమని.. టైటిల్ రైతు అనుకొంటున్నారని తెలిసింది.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ ఇకపై రాజకీయాలకు దూరమనే విషయం అర్థమవుతోంది. ఒకవేళ తమ్ముడు జనసేన పార్టీ ఏపీలో అధికారలోకి వస్తే.. అందులో ఏదైనా పెద్దన్న పాత్ర పోషిస్తారేమో చూడాలి. ఇదీగాక, తమ్ముడు పరపతితో అన్నయ్య ఏ గవర్నర్ గా నైనా.. లేదంటే మళ్లీ రాజ్యసభకు వెళ్లే అవకాశాలు లేకపోవచ్చు. అప్పటి వరకు మెగాస్టార్ నో పాలిటిక్స్.. ! ఓన్లీ మూవీస్.